ఆంధ్రప్రదేశ్ రాజధిని అమరావతిని ఎకో-ఫ్రెండ్లీ గరంగా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ను ప్రతిపాదించారు. సాధారణంగా ఒక నగరంలోని ప్రతి భవనంలోనూ విడివిడిగా వందలాది స్ప్లిట్ ఏసీలు, విండో ఏసీలు లేదా వేర్వేరు సెంట్రలైజ్డ్ ఏసీ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటారు.
కానీ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ విధానంలో నగరం మొత్తానికి లేదా ఒక నిర్దిష్ట మండలానికి సంబంధించి ఒకే చోట భారీ సెంట్రల్ కూలింగ్ ప్లాంట్ ఉంటుంది. అక్కడి నుంచే భూగర్భంలో పరిచిన ఇన్సులేటెడ్ పైప్‌లైన్ల ద్వారా శీతలీకరించిన నీటిని చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు కమర్షియల్ కాంప్లెక్స్‌లకు సరఫరా చేస్తారు.
ఈ వ్యవస్థ పనిచేసే తీరు చాలా సులభంగా ఉంటుంది. సెంట్రల్ ప్లాంట్‌లో అత్యంత చల్లబడిన నీరు పైప్‌లైన్ల ద్వారా భవనాల్లోని ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లకు చేరుకుంటుంది. భవనంలోని గాలిని చల్లబరిచిన తర్వాత, ఆ నీరు కొంత వేడెక్కి మళ్లీ రిటర్న్ పైప్‌లైన్ ద్వారా సెంట్రల్ ప్లాంట్‌కు చేరుకుంటుంది. అక్కడ నీటిని మళ్లీ రీ-సైకిల్ చేసి చల్లబరుస్తారు. ఈ సాంకేతికత వల్ల ప్రతి భవనం పైన లేదా ఆవరణలో సపరేట్ ఏసీ కంప్రెషర్లు, కూలింగ్ టవర్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది దుబాయ్, అబుదాబి, గుజరాత్ గిఫ్ట్ సిటీ వంటి ప్రపంచ స్థాయి అధునాతన నగరాల్లో విజయవంతంగా అమలులో ఉంది.
సాధారణ సాంప్రదాయ ఏసీ విధానంతో పోలిస్తే డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ వల్ల నగరానికి అపారమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో విద్యుత్ వినియోగం దాదాపు 35 నుంచి 50 శాతం వరకు తగ్గుతుంది. దీనివల్ల విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా, విద్యుత్ గ్రిడ్‌పై పడే భారం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా, గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు తగ్గి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది. ఇండివిజువల్ ఏసీల నుంచి వెలువడే వేడి గాలి నిరోధించటం వల్ల నగరంలో అర్బన్ హీట్ ఐలాండ్ సమస్య తలెత్తదు.
అమరావతిలోని ప్రభుత్వ పరిపాలనా నగరం లో నిర్మించే ఐకానిక్ భవనాల కోసం ఈ పద్ధతిని ఎంచుకోవడం ద్వారా నిర్మాణాలు అందంగా కనిపిస్తాయి . భవనాల పైన ఏసీ కంప్రెషర్లు ఉండవు. భవనాల్లో స్పేస్ ఆదా అవుతుంది. నిర్వహణ వ్యయం తగ్గడమే కాకుండా, నిరంతరాయంగా విఫలం కాకుండా చల్లదనం అందుతుంది. అమరావతిని ఆసియాలోనే అత్యుత్తమ స్థిరమైన నగరంగా నిలబెట్టడంలో ఈ డిస్ట్రిక్ట్ కూలింగ్ సాంకేతికత అత్యంత కీలకమైన అడుగు అని చెప్పవచ్చు.

