ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల సమరానికి ప్రభుత్వం మార్గం సుగమం చేస్తూ మంత్రివర్గ సమావేశంలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుంది. బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే లక్ష్యంతో గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.1 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు క్యాబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది.
సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేసి ప్రజాస్వామ్య వికేంద్రీకరణను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావాల్సిన భారీ నిధులు మురిగిపోకుండా రక్షించుకోవడమే లక్ష్యంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది. పాలకవర్గాలు లేకపోవడం వల్ల పంచాయతీలు, మున్సిపాలిటీలకు కేంద్రం నుంచి అందాల్సిన అభివృద్ధి గ్రాంట్లు నిలిచిపోయే ప్రమాదం ఉండటంతో, త్వరితగతిన ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పరుగులు పెట్టించాలని భావిస్తోంది.
పట్టణ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో ప్రజలే నేరుగా ఓటు వేసి ఎన్నుకునే విధానం నిర్వహించేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. హార్స్ ట్రేడింగ్, కౌన్సిలర్ల కొనుగోళ్లకు తావులేకుండా ఉండేందుకు ఈ సంస్కరణ తీసుకొచ్చారు. డిప్యూటీ మేయర్ విషయంలో గతంలో ఉన్న పాత విధానాన్నే కొనసాగిస్తూ, ఒకే డిప్యూటీ మేయర్ పదవికి పరిమితం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పార్టీ నేతలకు పదవుల్ని పంచడానికి ఇద్దరు డిప్యూటీ మేయర్లను గత ప్రభుత్వం నియమించేది.
ఈ భేటీలో స్థానిక సంస్థల సంస్కరణలతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పరిపాలనా అనుమతులకు సంబంధించి మొత్తం 57 అజెండా అంశాలకు మంత్రివర్గం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.

