దక్షిణ భారతదేశంలో పారిశ్రామిక హబ్‌గా వెలుగొందుతున్న తమిళనాడుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని రంగరించి, ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలను ఏపీకి రప్పించే ప్రయత్నాలను వేగవంతం చేయడంతో పొరుగు రాష్ట్రాల్లో చర్చ మొదలైంది.
ముఖ్యంగా తమిళనాడు సోషల్ మీడియా వేదికలపై పెట్టుబడులన్నీ ఏపీకి వెళ్లిపోతున్నాయని చర్చోపచర్చలు సాగుతున్నాయి. తెలంగాణ, కర్ణాటకకు రావాల్సిన ప్రాజెక్టులను కూడా ఏపీ తన వైపునకు తిప్పుకుంటోందని అక్కడి వారు గగ్గోలు పెడుతున్నారు.
ప్రతి ప్రాజెక్టును ఆకర్షించే ప్రయత్నంలో ఏపీ
ఏపీని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో పెట్టుబడులు పెట్టాలనుకున్న కంపెనీల గురించి ఆరా తీసి.. వాటిని ఏపీకి ఆహ్వానిస్తున్నారు లోకేష్, చంద్రబాబు. మంచి ప్రోత్సాహకాలు, ఫాలోఅప్ చేసే స్పీడ్ ఆఫ్ డూయింగ్ పద్దతులతో ఐటీ, తయారీ రంగ ప్రాజెక్టులు ఇప్పుడు ఏపీ వైపు మొగ్గు చూపుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏపీని నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లేందుకు ఇస్తున్న రాయితీలు, సింగిల్ విండో క్లియరెన్సులు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. గతంలో హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చిన ట్రాక్ రికార్డు ఆయనకు ఉండటంతో, పెట్టుబడిదారులు ఏపీలో తమ పెట్టుబడులకు భద్రత ఉంటుందని భావిస్తున్నారు.
తమిళనాడు ఆందోళన ఎందుకు?
తమిళనాడుకు ఆటోమొబైల్ , ఎలక్ట్రానిక్స్ తయారీలో తిరుగులేని ఆధిపత్యం ఉంది. అయితే, ఏపీలోని శ్రీసిటీ వంటి పారిశ్రామిక పార్కులు తమిళనాడు సరిహద్దులకు ఆనుకుని ఉండటం, అక్కడ భూమి ధరలు తక్కువగా ఉండటం తమిళనాడుకు ప్రతిబంధకంగా మారుతోంది. కియా మోటార్స్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీలో స్థిరపడటం, ఫాక్స్‌కాన్ వంటి సంస్థలు తమ కార్యకలాపాలను ఏపీలో విస్తరించడంపై తమిళనాడులో చర్చలు జరుగుతున్నాయి. తమ రాష్ట్రంలో ఉన్న రెడ్ టేపిజం వల్ల పెట్టుబడులు ఏపీకి తరలిపోతున్నాయని అనుకుంటున్నారు.
స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్
చంద్రబాబు ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో నేరుగా చర్చలు జరపడం, అవసరమైతే కేబినెట్ స్థాయిలోనే నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచుతున్నాయి. కేవలం ఐటీ మాత్రమే కాకుండా, గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు, ఆక్వా రంగాల్లో ఏపీ చూపుతున్న వేగం ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ కు దారితీసింది. ఏపీకి పెట్టుబడులు రావడం వల్ల కేవలం ఆ రాష్ట్రానికే కాకుండా, దక్షిణ భారతదేశం మొత్తం ఒక బలమైన ఆర్థిక శక్తిగా మారుతుందని కొందరు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే, సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చల వల్ల రాష్ట్రాల మధ్య పోటీ పెరిగి, పారిశ్రామికవేత్తలకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు దక్కే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం మాత్రం మేము ఎవరి పెట్టుబడులను లాక్కోవడం లేదు.. మా దగ్గర ఉన్న వనరులు ,పారదర్శక పాలన చూసి వారే వస్తున్నారు అని స్పష్టం చేస్తోంది.

