భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఐదు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ వచ్చారు నితిన్ నబిన్. సోమవారం రాత్రి నూతనంగా అందుబాటులోకి వచ్చిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా విశాఖ చేరుకున్న ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఇతర సీనియర్ నాయకులు, భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు సాంప్రదాయ కళారూపాలు, డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికాయి.
పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం నితిన్ నబిన్ విశాఖ తీరంలోని బీచ్ రోడ్డులో ఉన్న మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుని, రాష్ట్ర ప్రజల సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు వైదిక మంత్రోచ్ఛారణల మధ్య వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశంలో నితిన్ నబిన్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 945 మండలాల ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరైన ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, బూత్ స్థాయి నుంచి పార్టీని స్వయంసమృద్ధిగా బలోపేతం చేయడంపై ఆయన కీలక దిశా నిర్దేశం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏపీకి లభిస్తున్న కేంద్ర సహాయం, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, అలాగే పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసేందుకు కట్టుబడి ఉండటంపై ఈ సమావేశంలో ప్రాధాన్యతనిస్తూ తీర్మానాలు ఆమోదించారు.
విశాఖ పర్యటనలో భాగంగా సాయంత్రం యువతతో జెన్ జీ యువ సంవాద్ పేరుతో నితిన్ నబిన్ ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎంపిక చేసిన 250 మంది యువ న్యాయవాదులు, వైద్యులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, విద్యాధికులతో భవిష్యత్ రాజకీయాలు, యువ నాయకత్వ ప్రోత్సాహంపై ఆయన చర్చించనున్నారు. విశాఖ సమావేశాలు ముగిసిన అనంతరం నితిన్ నబిన్ గుడిలోవలో జరిగే ఆర్ఎస్ఎస్ ) అఖిల భారత సమన్వయ బైఠక్ సమావేశాల్లో పాల్గొననున్నారు.

