ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రామకంఠం భూములు, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ల వివాదానికి చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.
వెబ్‌లాండ్ రికార్డుల్లో గ్రామకంఠంగా నమోదైన ఆస్తుల రిజిస్ట్రేషన్లకు లైన్ క్లియర్ చేస్తూ రెవెన్యూ శాఖ సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ కొత్త నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది గ్రామీణ, పట్టణ ప్రాంత వాసులకు తమ సొంత ఇళ్లపై పూర్తిస్థాయి చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు లభించనున్నాయి.
ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, వెబ్‌లాండ్ రికార్డుల్లో ఒక సర్వే నంబర్ గ్రామకంఠం అని నమోదైతే, అది సెక్షన్ 22-A కింద నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందా లేదా అనే అంశంతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సిందే. గతంలో సబ్-డివిజన్ ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్ల మొత్తం సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో పెట్టడంతో దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఇప్పుడు ఆ చిక్కుముడులన్నింటినీ తొలగిస్తూ, సామాజిక అవసరాలకు కేటాయించిన భూములు మినహా మిగిలిన అన్ని వ్యక్తిగత నివాస ప్రాంతాల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ ఉత్తర్వుల్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సడలింపు ఏమిటంటే-డాక్యుమెంట్ల కోసం సామాన్యులను ఇబ్బంది పెట్టకూడదని స్పష్టం చేయడం. గ్రామకంఠం పరిధిలో వారసత్వంగా వచ్చిన పాత ఇళ్లకు, స్థలాలకు ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు లేకపోయినప్పటికీ, స్థానిక సంస్థలు జారీ చేసిన ఇంటిపన్ను రశీదు ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ పట్టణ ప్రాంతాల్లోని వారసత్వ స్థలాలు ఖాళీగా ఉండి, ఇంటిపన్ను లేకపోతే ఖాళీ స్థల పన్ను రశీదును ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది.
గ్రామీణ ప్రాంతాల్లో వంశపారంపర్యంగా వస్తున్న ఖాళీ స్థలాలకు ఎలాంటి లింక్ పత్రాలు కానీ, పన్ను రశీదులు కానీ లేని పక్షంలో.. కేవలం కొనుగోలు/అమ్మకం జరిపే వ్యక్తి ఇచ్చే స్వయం ధ్రువీకరణ పత్రాన్ని అంగీకరించాలని రిజిస్ట్రేషన్ శాఖ స్పష్టం చేసింది. ఈ భూమి తమ ఆధీనంలోనే ఉందని, వివాద రహితమైనదని సదరు వ్యక్తి డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. ఇందుకోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లు తేవాలంటూ కొనుగోలుదారులపై ఒత్తిడి చేయవద్దని, ఆ నెపంతో రిజిస్ట్రేషన్లను ఆపకూడదని సబ్-రిజిస్ట్రార్లకు ప్రభుత్వం కరాఖండిగా ఆదేశాలు జారీ చేసింది. ఇవి ప్రజలకు ఎంతో మేలు చేయనున్నాయి.

