ఆంధ్రప్రదేశ్‌లో గత కొంతకాలంగా కొంతమంది పాస్టర్లు ప్రదర్శిస్తున్న అభినయం చూస్తుంటే వారు మత ప్రచారకులు కాదు, ఆరితేరిన నటులు అనిపిస్తోంది. అల్లూరి జిల్లా పాడేరు అడవుల్లో పాస్టర్ అభినయ్ దర్శన్ ఆడిన హత్యాయత్నం డ్రామా దీనికి నిలువెత్తు నిదర్శనం.
తనపై ఎవరో దాడి చేశారంటూ స్వయంగా కారు అద్దాలు పగలగొట్టుకుని, చిన్నపాటి గాయాలతో సోషల్ మీడియాలో సానుభూతి కోసం పాకులాడిన తీరు సభ్యసమాజాన్ని విస్మయానికి గురిచేసింది. అడవి బిడ్డల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, వారిని మతం మార్చడమే కాకుండా, ఇప్పుడు వారిని ఇలాంటి వికృత రాజకీయ క్రీడల్లో పావులుగా వాడుకోవడం వారి కుట్రలకు పరాకాష్టగా మారింది.
ప్రమాదాలకు కూడా మత రంగు పూస్తూ..
నిజానికి ఏపీలో పాస్టర్లు కేవలం డ్రామాలకే పరిమితం కావడం లేదు, ఏదైనా ప్రమాదం జరిగినా దాన్ని మతపరమైన దాడులుగా చిత్రీకరించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. గతంలో రాజమండ్రి రోడ్డు ప్రమాదంలో ఒక పాస్టర్ మరణిస్తే, దాన్ని కూడా ఒక వర్గంపైకి నెట్టేందుకు చేసిన ప్రయత్నాలు రాష్ట్రం మొత్తం చూసింది. తమ వర్గంపై దాడులు జరుగుతున్నాయనే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ చాలా రాజకీయం చేశారు. హర్షకుమార్ లాంటి వాళ్లు ఈ పేరుతో డబ్బులు కూడా వసూలు చేశారు.
వీరి వెనుక ఉన్న అదృశ్య హస్తం ఎవరిది?
సాధారణ పాస్టర్లకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తోంది? పోలీసులంటే భయం లేకుండా పక్కాగా స్కిప్టులు రాసుకుని మరీ దాడుల డ్రామాలు ఆడుతున్నారంటే వీరి వెనుక బలమైన రాజకీయ శక్తులు ఉన్నాయని స్పష్టమవుతోంది. ముఖ్యంగా రాజకీయంగా ఒక వర్గాన్ని దెబ్బతీయడానికి, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి కొన్ని శక్తులు వీరిని ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. ఈ పాస్టర్ల ఫోన్ కాల్ డేటా , బ్యాంక్ అకౌంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తే, వీరు ఆడుతున్న డ్రామాల వెనుక ఉన్న సూత్రధారులు ఎవరో బయటపడటం ఖాయం.
ప్రజలను రెచ్చగొట్టి ఏం సాధిస్తారు?
పవిత్రమైన బైబిల్ పట్టుకుని అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా వీరు ఎవరికి మేలు చేస్తున్నారు? అభినయ్ దర్శన్ లాంటి వారు పోలీసుల విచారణలో దొరికిపోయినా, ఇంకా కొంతమంది అదే మొండితనంతో సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కుల, మత సామరస్యాన్ని దెబ్బతీసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న ఈ పాస్టర్ల ఆటలకు అడ్డుకట్ట వేయాల్సిన సమయం వచ్చింది. దేవుడి పేరు చెప్పి మోసాలకు పాల్పడే ఇలాంటి నకిలీ పాస్టర్ల వల్ల నిజమైన ఆధ్యాత్మిక వేత్తలకు కూడా చెడ్డపేరు వస్తోంది.

