హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసంపై తాజాగా జరిగిన ఏసీబీ దాడులు నగరాన్ని నివ్వెరపరిచాయి. కేవలం నగదు రూపంలోనే రూ. 1.05 కోట్లు, భారీగా బంగారం, వందల కోట్ల విలువైన ఆస్తి పత్రాలు దొరకడం చూస్తుంటే సామాన్యుడి రక్తాన్ని అవినీతి అధికారులు ఎలా జుర్రుకుంటున్నారో అర్థమవుతోంది.
గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ మాజీ ఈఎన్సీ హరిరామ్ వద్ద రూ. 200 కోట్ల అక్రమాస్తులు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్ వద్ద 19 ప్లాట్లు, విల్లాలు బయటపడినప్పుడు కూడా ఇలాగే ఆశ్చర్యపోయాం. కానీ, ఆ తర్వాత ఏమైంది? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
శిక్షల శాతం అత్యంత దారుణం
హైదరాబాద్‌కు చెందిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇటీవల వెల్లడించిన సమాచారం ప్రకారం.. గత ఐదేళ్లలో ఏసీబీ సుమారు 600కు పైగా కేసులు నమోదు చేసింది. అయితే, అందులో విచారణ పూర్తయి, నిందితులకు శిక్షలు పడుతున్న రేటు చాలా తక్కువగా ఉంది. కొన్ని నివేదికల ప్రకారం, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో శిక్షల శాతం కేవలం 20 నుంచి 25 శాతానికే పరిమితమవుతోంది. అంటే, పట్టుబడిన ప్రతి పది మందిలో ఎనిమిది మంది క్లీన్ చిట్‌తో బయటకు వస్తున్నారు లేదా దశాబ్దాల పాటు కేసులను సాగదీసి సాక్ష్యాలు లేకుండా చేస్తున్నారు. కేవలం 2025లోనే 199 కేసులు నమోదు చేసి 273 మందిని అరెస్టు చేసిన ఏసీబీ, తీరా కోర్టుల వరకు వెళ్లేసరికి సాక్ష్యాధారాల సేకరణలోనో, ప్రభుత్వం నుంచి అనుమతులు పొందడంలోనో విఫలమవుతోంది.
విచారణల పేరిట కాలయాపన
ఒక అధికారి అవినీతికి పాల్పడుతూ పట్టుబడితే, అతడిపై విచారణ జరపడానికి ప్రభుత్వం నుంచి అనుమతి రావడానికే ఏళ్ల సమయం పడుతోంది. ఎఫ్‌జీజీ నివేదిక ప్రకారం వందలాది కేసులు కేవలం ఈ శాంక్షన్ల కోసమే పెండింగ్‌లో ఉన్నాయి. ఈలోపు సదరు అధికారి పదవీ విరమణ చేయడం లేదా స్టేలు తెచ్చుకుని తిరిగి అదే శాఖలో కీలక పోస్టుల్లో కూర్చోవడం పరిపాటిగా మారింది. చట్టంలోని సందు గొందులే అక్రమార్కులకు ధీమాను ఇస్తున్నాయి. ఒకసారి ఏసీబీకి దొరికినా, కేసు తేలడానికి పదేళ్లు పడుతుంది.. ఆ లోపు ఆస్తులను బినామీల పేరిట దాచుకోవచ్చు అనే భరోసా అధికారులను మరింతగా బరితెగించేలా చేస్తోంది.
ఆస్తుల జప్తు - అప్పుడే భయం
ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం.. కేసు నిరూపితమయ్యే వరకు నిందితుల ఆస్తులు వారి వద్దే లేదా వారి బినామీల వద్దే ఉంటున్నాయి. దీనికి బదులుగా, ఏసీబీ పక్కా ఆధారాలతో దాడి చేసిన వెంటనే, ఆ ప్రాథమిక ఆధారాల ఆధారంగా ఆస్తులను తక్షణమే జప్తు చేసే చట్టం మరింత బలోపేతం కావాలి. పట్టుబడిన అధికారిని కేవలం సస్పెండ్ చేయడం కాకుండా డిస్మిస్ చేయాలి. సదరు అధికారి అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నింటినీ ప్రభుత్వం తన స్వాధీనంలోకి తీసుకుని, వాటిని ప్రజా ప్రయోజనాల కోసం వాడాలి. నిందితుడిని రోడ్డున పడేసేంత కఠినమైన చర్యలు ఉంటేనే, ఐదు వేల రూపాయల లంచం తీసుకోవాలన్నా చేతులు వణుకుతాయి.
జలమండలి కుమార్ లాంటి వారు కేవలం లక్షన్నర జీతంతో కోట్లు సంపాదిస్తున్నారంటే అది వ్యవస్థలోని లోపం. చట్టానికి ఉన్న కళ్లు అవినీతిని చూస్తున్నా, చట్టానికి ఉన్న చేతులు శిక్షలు వేయడంలో బలహీనంగా మారుతున్నాయి. ఏ రోజైతే అవినీతి పరుడి ఆస్తిని ప్రభుత్వం బహిరంగంగా స్వాధీనం చేసుకుని అతడిని శిక్షిస్తుందో, ఆ రోజే సమాజంలో మార్పు మొదలవుతుంది. లేకపోతే, ఏసీబీ దాడులు కేవలం దినపత్రికల్లో వార్తలకే పరిమితమవుతాయి తప్ప, అవినీతి అంతం అనేది ఒక కలగానే మిగిలిపోతుంది.

