Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏసీబీ వలలో మరో వంద కోట్ల అధికారి !

ఏసీబీ వలలో మరో వంద కోట్ల అధికారి !

Telugu 360 2 days ago

తెలంగాణ రెవెన్యూ శాఖలో లంచాల సామ్రాజ్యాన్ని సృష్టించిన మరో వంద కోట్ల అధికారి అవినీతి నిరోధక శా వలలో చిక్కాడు. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ కే.

వంశీ మోహన్ అక్రమ ఆస్తుల గుట్టు రట్టు చేస్తూ.. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో ఎనిమిది ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన ఈ సోదాలు రెవెన్యూ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో వందల కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు, బినామీల గుట్టు ఈ దాడుల్లో వెలుగుచూడటం సంచలనంగా మారింది.

వంశీ మోహన్ గతంలో శేరిలింగంపల్లి, అబ్దుల్లాపూర్ మెట్ వంటి ప్రాంతాల్లో ఆర్డీవో గా పనిచేశారు. కంచె చేను మేసిన చందంగా.. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన ఈ అధికారే ల్యాండ్ మాఫియాకు పెద్ద దిక్కుగా మారినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని పిగ్లీపురంలో సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసి, దాన్ని తన మామ పేరుపై రికార్డుల్లోకి ఎక్కించడం ఈయన అవినీతికి పరాకాష్ట. ఆ తర్వాత ఆ భూమిని ఒక రియల్టర్‌కు దారాదత్తం చేసి వందల కోట్ల లాభాలను ఆర్జించినట్లు ఏసీబీ పక్కా ఆధారాలు సేకరించింది.

ఈ అవినీతి చక్రవర్తి కేవలం నగదు రూపంలోనే కాకుండా, రియల్టర్ల నుంచి ప్లాట్లను కూడా లంచాలుగా స్వీకరించినట్లు తెలుస్తోంది. భూముల మ్యుటేషన్లు, లేఅవుట్ల క్లియరెన్స్ కోసం ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి ఏకంగా 10 విలాసవంతమైన ప్లాట్లను గిఫ్ట్ డీడ్ రూపంలో తన బంధువుల పేర్లపై రాయించుకున్నట్లు అధికారులు గుర్తించారు. శేరిలింగంపల్లి ఐటీ కారిడార్ పరిసరాల్లో ఈయన వేసిన భూదందాల లెక్క చూసి ఏసీబీ అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. బినామీల పేర్లతో నిర్మించిన విల్లాలు, ఫ్లాట్లు, తోటల డాక్యుమెంట్లు ఈ సోదాల్లో గుట్టలుగా దొరికాయి.

ప్రస్తుతం వంశీ మోహన్‌కు చెందిన బ్యాంక్ లాకర్లను తెరిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వీటిలో భారీగా బంగారం, నగదు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ భారీ భూదందా వెనుక రెవెన్యూ శాఖలోని కొందరు ఉన్నతాధికారుల హస్తంతో పాటు, రాజకీయ నాయకుల ఆశీస్సులు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సోదాలు పూర్తయ్యే సరికి వందల కోట్ల లెక్కలు తేలే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360