Dailyhunt
ఎట్టకేలకు రుషికొండ ప్యాలెస్‌పై కీలక నిర్ణయం !

ఎట్టకేలకు రుషికొండ ప్యాలెస్‌పై కీలక నిర్ణయం !

Telugu 360 3 weeks ago

విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ భవితవ్యంపై సందిగ్ధతకు తెరపడబోతోంది. గత ప్రభుత్వం నిర్మించిన ఈ అత్యంత విలాసవంతమైన భవనాలను ఎలా వినియోగంలోకి తేవాలన్న అంశంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ అమరావతి సచివాలయంలో సమావేశమై నిర్ణయం తీసుకుంటుంది.

రుషికొండపై గత ప్రభుత్వం సుమారు రూ.400 కోట్లకు పైగా ప్రజాధనంతో నిర్మించిన ఈ ప్యాలెస్ ప్రస్తుతం ప్రభుత్వానికి ఒక వైట్ ఎలిఫెంట్ లా మారింది. గతంలో ఇక్కడ ఏడాదికి రూ.7 కోట్ల ఆదాయం ఇచ్చే పర్యాటక శాఖ రిసార్ట్స్ ఉండేవి. వాటిని కూల్చేసి ఈ ప్యాలెస్ కట్టడం వల్ల ఆదాయం పోవడమే కాకుండా.. ఇప్పుడు కేవలం వీటి నిర్వహణ , విద్యుత్ బిల్లుల కోసమే ప్రతి నెలా రూ. 25 లక్షలప్రజాధనం వృధా అవుతోంది. ఈ అనాలోచిత నిర్ణయాల వల్ల ఖజానాపై పడుతున్న భారాన్ని తగ్గించడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా ఉంది.

నేటి భేటీలో కమిటీ కొన్ని కీలక సిఫార్సులను ఖరారు చేయనుంది. రుషికొండ భవనాలను కేవలం ప్రదర్శన వస్తువులుగా ఉంచకుండా, వాటిని ప్రజా ప్రయోజనార్థం , ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే వనరుగా మార్చాలని కమిటీ భావిస్తోంది. దీనికోసం ప్రధానంగా రెండు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి: ప్రముఖ హోటల్ చైన్స్ తాజ్, లీలా ప్యాలెస్ వంటివి ఈ భవనాలపై ఆసక్తి చూపినందున వీటిని లగ్జరీ హోటళ్లుగా లేదా రిసార్ట్స్‌గా మార్చడం అనే ఆప్షన్లు పరిశీలిస్తున్నారు.

నేటి సమావేశంలో ప్యాలెస్ వినియోగంపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చి, రూపొందించిన సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కమిటీ సమర్పించనుంది. అనంతరం జరిగే రాష్ట్ర కేబినెట్ భేటీలో ఈ నివేదికపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ విలాసవంతమైన భవనాలను ప్రభుత్వం ఎలా ఉపయోగంలోకి తెస్తుందోనని అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360