Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫోర్త్ స్టేజ్‌కు వైసీపీ ఫేక్ క్యాన్సర్ !

ఫోర్త్ స్టేజ్‌కు వైసీపీ ఫేక్ క్యాన్సర్ !

Telugu 360 1 week ago

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేక్ క్యాన్సర్ అనే జబ్బు అడ్వాన్సుడ్‌ స్టేజ్‌కు చేరిపోయింది. క్షేత్రస్థాయిలో ఏం చేయాలో, ఎలా ప్రజాదరణ పొందాలో తెలియక అడ్డగోలు అబద్ధాలతో ఏదో ఒక హడావుడి చేయాలని చేస్తున్నారు.

అసలేమీ జరగకపోయినా ఏదో జరిగిపోయిందన హడావుడి చేస్తున్నారు. అందరికీ తెలిసిన విషయాన్ని కొత్తగా ఫేక్ న్యూస్‌తో ప్రచారం చేస్తున్నారు. వైసపీ తీరు చూసి ఇలా అయిపోయారేంటి అని అందరూ జాలి పడాల్సిందే వస్తోంది.

అమరావతి పనులపై ఫేక్ దాడి

అమరావతిలో జోరుగా సాగుతున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల వద్దకు వెళ్లి, ఆ బ్రిడ్జి కాస్తా వంగిపోయిందంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పెద్ద షో చేశారు. అసలు ఆ బ్రిడ్జి ఎక్కడ వంగిందో, ఎవరికి వంగిందో ఇంజనీర్లకు కూడా తెలియదు కానీ, వారి సొంత మీడియా సాక్షి లో మాత్రం అది కుంగిపోయిందంటూ కథనాలు వండేసి చేతులు దులిపేసుకున్నారు. వైసీపీ వారి క్రియేటివిటీ అక్కడితో ఆగలేదు. ఆ మరుసటి రోజు రోడ్డు నిర్మాణం కోసం పక్కనే ఉన్న గుట్టలను తొలుస్తుంటే.. దాన్ని ఎవరో అక్రమంగా మైనింగ్ చేసేస్తున్నారంటూ ఇంకో కొత్త ప్రచారానికి తెరలేపారు. ఇక అమరావతిపై వీరికి ఉన్న ప్రత్యేక ప్రేమ కొద్దీ.. రాజధానిలో సరికొత్తగా అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ ప్లాన్ చేశారని, దానివల్ల గన్నవరం ఎయిర్‌పోర్టును శాశ్వతంగా మూసేస్తారంటూ ఊహాజనిత భయాలను ప్రజల్లోకి వదిలారు. నిజానికి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో కొత్త టెర్మినల్ పనులు తుది దశకు చేరిన సంగతిని కూడా మర్చిపోయి ఈ ఫేక్ ప్రపంచంలో విహరిస్తున్నారు.

విశాఖ యూనిటీ మాల్‌పైనా అదే విషం

ఇలాంటి విచిత్రమైన ఫేక్ స్టోరీలు కేవలం అమరావతికే పరిమితం కాలేదు, విశాఖపట్నానికీ విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యూనిటీ మాల్ ప్రాజెక్టు కొండపైనే ఉంది. అన్ని పర్యావరణ అనుమతులు, చట్టపరమైన రూల్స్ ప్రకారమే ఈ నిర్మాణం జరుగుతోంది. కానీ వైసీపీ నేతలు మాత్రం గతంలో వివాదాస్పదమైన రుషికొండ ప్యాలెస్ ఉదంతాన్ని దీనికి ముడిపెడుతూ రచ్చ రంకెలు వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వాణిజ్య ప్రాజెక్టుకు, నాటి లగ్జరీ బాత్‌టబ్ ప్యాలెస్‌కు తేడా తెలియకుండా మాట్లాడటం చూసి జనం నవ్వుకుంటున్నారు.

ఫేక్ ప్రపంచంలో బతికితే ఫేక్ బతుకులే

వాస్తవ ప్రపంచంలో ఏమీ జరగకపోయినా, ఏదో ఘోరం జరిగిపోతోందంటూ వైసీపీ ఒక ఫేక్ ఊహాలోకంలో బతికేస్తోంది. కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లి చందంగా.. తాము సృష్టించిన అబద్ధాల సామ్రాజ్యాన్ని తామే నిజమని నమ్ముతూ, తమను నమ్మిన కేడర్‌ను కూడా అదే మాయా ప్రపంచంలోకి లాక్కెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా ఈ ఫేక్ రోగంలోంచి బయటకు వచ్చి, నిజమైన ప్రతిపక్షంగా వాస్తవాలపై పోరాడటం నేర్చుకోకపోతే.. జనం వీరిని శాశ్వతంగా ఒక ఫేక్ వాట్సాప్ గ్రూప్ లాగే చూసే ప్రమాదం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360