Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

గరివిడి లక్ష్మి రివ్యూ: బుర్రకథే. కానీ బయోపిక్

Telugu 360 5 days ago

బయోపిక్‌తో మెప్పించడం అంత ఈజీ కాదు. అందులోనూ పెద్దగా ప్రచారం లేని వ్యక్తుల జీవితాలను తెరపైకి తీసుకురావడం మరో సవాల్. గరివిడి లక్ష్మి కూడా ఈ కోవలోకి వస్తుంది.

రెండు దశాబ్దాల క్రితం ఉత్తరాంధ్ర బుర్రకథ కళలో ఆమె మేటి. పలు సినిమాల్లో ఆమె పాటలు వాడుకున్నారు. కాకపోతే, ఆమె గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఇప్పుడామె జీవితంతో 'గరివిడి లక్ష్మి'గా వెండితెరపైకి వచ్చింది. మరి ఆమె జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలేమిటి? ఆమె ప్రయాణంలోని ఎత్తుపల్లాలు, ఓ అమ్మాయిగా ఆమె అంతర్మథనం, కళాకారిణిగా తన ప్రతిభ ప్రేక్షకుడికి ఎలాంటి అనుభూతులను ఇచ్చాయి?

విజయనగరం దగ్గర గరివిడి అనే చిన్న పల్లెటూరు. చిన్నప్పుడే తల్లి సన్యాసిగా మారిపోవడం, బాల్యంలో జరిగిన పెళ్లి వికటించడంతో లక్ష్మి (ఆనంది) ఒంటరిదైపోతుంది. ఆ చీకటి జీవితంలోకి 'పాట', 'బుర్రకథ' వెలుగులా వస్తాయి. సత్తిబాబు (రాగ్ మయూర్), రాంబాబు (నరేష్) తోడుతో స్టేజ్ ఎక్కిన లక్ష్మి.. బుర్రకథకు కొత్త జోష్ తీసుకొస్తుంది. అంత అపారమైన ప్రతిభ ఉన్న ఆ కళాకారిణి సడన్‌గా ఎందుకు అదృశ్యమైపోయింది? ఆమె గుర్తింపును ఎవరు దోచుకున్నారు? అనేది మిగతా కథ.

సహజంగా బయోపిక్స్ అనగానే జీవితాన్ని వరుస క్రమంలో చూపించే ప్రయత్నం ఉంటుంది. కొన్ని బయోపిక్స్‌కు మాత్రం సినిమా కథలాంటి కాన్ఫ్లిక్ట్‌లు దొరుకుతాయి. గరివిడి లక్ష్మి జీవితంలో అలాంటి పాయింట్స్ ఉన్నాయి. రెండు దశాబ్దాల క్రితం ఉత్తరాంధ్ర బుర్రకథను తన గళంతో శాసించిన గాయని గరివిడి లక్ష్మి. కాకపోతే, ఆమె గుర్తింపునే చెరిపేసే ప్రయత్నం జరిగింది. ఆమె కోల్పోయిన గుర్తింపును తిరిగి అందించాలన్న దర్శకుడి ప్రయత్నం ప్రేక్షకులను కదిలించేలా ఉంటుంది.

ట్రీట్‌మెంట్ పరంగా మహానటి సావిత్రి బయోపిక్ దారిలోనే పయనించిన సినిమా ఇది. ఇద్దరు యువ దర్శకులు ఆమె కథ కోసం ప్రయాణం మొదలుపెట్టడం, లక్ష్మి బాల్యం, పాటలపై ప్రేమ, బుర్రకథ కళాకారిణిగా మారడం ఇవన్నీ ఆసక్తిగా సాగుతాయి. లక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందనే హుక్ పాయింట్‌ను చివరివరకు కొనసాగించి కాస్త సస్పెన్స్‌ను కూడా నడిపారు.

బుర్రకథే కాదు, ఇందులో ఓ అమ్మాయి ధైర్యంగా నిలబడిన ప్రయాణం ఉంది. అదే సమయంలో తనకు నచ్చినట్లు బతికిన స్వేచ్ఛ ఉంది. మోసపోయి ఒంటరిగా మిగిలిపోయిన ఆవేదన ఉంది. చివరికి తన ఉనికినే కోల్పోయిన కథ ఉంది. ఈ ఎమోషన్స్ అన్నింటినీ దర్శకుడు తెరపై ఆవిష్కరించిన విధానం సహజంగా ఉంటుంది.

కాకపోతే, ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయి. కథ చెప్పే విధానం చాలా సాదాసీదాగా, ఎలాంటి సినిమాటిక్ హంగులు లేకుండా ఉంటుంది. గరివిడి లక్ష్మి పాటలు అంటేనే జోష్. కనీసం ఆ పాటలను సైతం జనరంజకంగా చిత్రీకరించలేదనే భావన కలుగుతుంది. సినిమాను సహజంగా తీయడం మంచిదే కానీ, ఇప్పుడు ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా టేకింగ్ ఉంటే రీచ్ ఇంకా బెటర్‌గా ఉండేది.

నటిగా ఆనంది ఆకలి తీరిపోయింది. ఆమె కెరీర్‌లో గరివిడి లక్ష్మి పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తన నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆ పాత్రకు వన్నె తెచ్చింది. చాలా హుందాగా కనిపించింది. బుర్రకథ చెప్పినప్పుడు ఎంత హుషారుగా ఉంటుందో, మోసపోయి ఒంటరిగా నిలబడినప్పుడు ఆమె కళ్లల్లో కనిపించే భావోద్వేగం మనసుని కదిలించేస్తుంది. కొన్నిచోట్ల అప్రయత్నంగా కన్నీళ్లు వచ్చేశాయి. అంతలా ఆ పాత్రలో లీనమైపోయింది. రాగ్ మయూర్ పాత్రలో కూడా మంచి ఆర్క్ ఉంది. నరేష్ మరో వైవిధ్యమైన పాత్రలో కనిపించాడు. రాశి పాత్ర కూడా ఎమోషన్‌ను తీసుకొచ్చింది. అంకిత్ కొయ్యకు కీలక పాత్ర దక్కింది. మిగతా నటీనటులంతా కథకు తగ్గట్టుగా కనిపించారు.

దర్శకుడు గౌరి కథలోని ఎమోషన్‌ను చక్కగా డీల్ చేశాడు. ఉత్తరాంధ్ర మాండలికంలో తను రాసుకున్న డైలాగులు చాలా ప్రామాణికంగా ఉంటాయి. గరివిడి లక్ష్మి పాటలకు తోడు చరణ్ అర్జున్ నేపథ్య సంగీతం ఎమోషన్‌ను మరింత పెంచుతుంది. నిర్మాతగా కృతి ప్రసాద్‌కు ఇది తొలి సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో గుర్తుపెట్టుకునే సినిమా ఇది.

గరివిడి లక్ష్మికి పెద్ద స్టార్ ఎట్రాక్షన్, కమర్షియల్ హంగులు లేకపోవచ్చు. కానీ మంచి సినిమా ఆస్వాదించాలనుకునే ప్రేక్షకులకు మాత్రం నచ్చే సినిమా.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360