Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గెలిచాడు కాబట్టి విజయ్‌వన్నీ సక్సెస్‌ఫుల్ వ్యూహాలే!

గెలిచాడు కాబట్టి విజయ్‌వన్నీ సక్సెస్‌ఫుల్ వ్యూహాలే!

Telugu 360 3 weeks ago

రాజకీయాల్లో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏదైనా ఉందంటే అది గెలుపు . గెలిచిన వాడిని విజేతగా నిలబెట్టి, అతను వేసిన ప్రతి అడుగునూ ఒక అద్భుత వ్యూహంగా అభివర్ణించడం విశ్లేషకులకు అలవాటు.

నిజానికి, విజయానికి వేల మంది తండ్రులు ఉంటారు కానీ, ఓటమి మాత్రం ఎప్పుడూ అనాథే. తమిళనాడులో విజయ్ సాధించిన ఈ అసాధారణ ఫలితాల వెనుక ఎవరెన్ని మేధోమథనాలు చేసినా, అంతిమంగా నిలిచే సత్యం ఒకటే. రాజకీయాల్లో గెలుపోటములకు ఏకైక ప్రాతిపదిక ప్రజలు మాత్రమే. వ్యూహాలు అనేవి కేవలం గెలుపు గుర్రం ఎక్కిన తర్వాత రాసే భాష్యాలు మాత్రమే.

పొత్తులు పెట్టుకోలేదని ఇప్పుడు పొగుడుతారు!

విజయ్ ఒంటరిగా వెళ్ళాడు కాబట్టే గెలిచాడని, లేదా పాత పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు కాబట్టే ప్రజలు పట్టం కట్టారని ఇప్పుడు చాలామంది సిద్ధాంతాలు చేస్తున్నారు. కానీ, ఇదే విజయ్ గనుక ఓడిపోయి ఉంటే.. రాజకీయ అనుభవం లేక పొత్తులు లేకుండా వెళ్ళడం వల్లే బొక్కబోర్లా పడ్డారు అని అవే నోళ్లు విమర్శించేవి. ప్రజలు ఎందుకు ఓటు వేస్తారో, ఏ క్షణంలో ఎవరికి పట్టం కడతారో అనేది కేవలం ప్రజలకే ఎరుక. ఒక రాష్ట్రంలో పని చేసిన ఫార్ములా మరో రాష్ట్రంలో పని చేయదు. రాజకీయాల్లో కాపీ-పేస్ట్ సంస్కృతి ఎప్పుడూ విఫలమవుతూనే ఉంటుంది.

విజయ్‌కు కలసి వచ్చినకాలం

తమిళనాడు ప్రస్తుత పరిస్థితులు విజయ్‌కు ఒక అనివార్యమైన అవకాశాన్ని కల్పించాయి. కరుణానిధి, జయలలిత వంటి మహా వృక్షాలు కూలిపోయిన తర్వాత ఏర్పడిన శూన్యం ఇంకా అలాగే ఉంది. ఎడప్పాడి పళనిస్వామి తన ఉనికిని కాపాడుకోవడానికే పరిమితం కావడం, స్టాలిన్ పాలనపై సహజంగా వచ్చే అసంతృప్తి విజయ్‌కు కలిసి వచ్చాయి. అంటే, ఇక్కడ విజయ్ గొప్ప వ్యూహాలు రచించడం కంటే, అక్కడి సామాజిక, రాజకీయ శూన్యం ఆయనను ఆహ్వానించింది. ప్రజలకు ఒక కొత్త ముఖం కావాలి, ఆ ముఖం విజయ్ రూపంలో దొరికింది. అంతే తప్ప, ఇందులో రహస్య వ్యూహాలు ఏమీ లేవు.

పొలిటికల్ వాక్యూమ్ విజయ్‌కు ప్లస్

ప్రతి రాష్ట్రానికి దానికంటూ ఒక ప్రత్యేకమైన కుల, మత, ప్రాంతీయ సమీకరణాలు ఉంటాయి. తమిళనాడులో ఉన్న ద్రవిడ సెంటిమెంట్, సినిమా స్టార్లపై ఉండే ఆరాధన మిగిలిన రాష్ట్రాల్లో ఉండకపోవచ్చు. అందుకే, విజయ్ ఇక్కడ సక్సెస్ అయ్యాడు కదా అని వేరే రాష్ట్రాల్లోని నటులు కూడా పార్టీలు పెట్టేసి ఇదే ఫలితాన్ని ఆశించడం అత్యాశే అవుతుంది. వ్యూహకర్తలు ఇచ్చే సలహాల కంటే, జనం గుండె చప్పుడును అర్థం చేసుకున్నప్పుడే ఎవరైనా నాయకులు అవుతారు. విజయ్ విషయంలో ఆ చప్పుడు ఆయనకు అనుకూలంగా మోగింది.

అవకాశం నిలబెట్టుకోవడం చాలా కష్టం.

రాజకీయాల్లో రేపటి గురించి ఎవరూ జోస్యం చెప్పలేరు. ఈ రోజు జైత్రయాత్ర చేస్తున్న విజయ్, రేపు పాలనలోనో లేదా రాజకీయ గమనంలోనో పొరపాట్లు చేస్తే.. ఈ రోజు అద్భుతం అన్న విశ్లేషకులే రేపు అపరిపక్వత అని ముద్ర వేస్తారు. గెలిచినప్పుడు వ్యూహాలు, ఓడినప్పుడు తప్పిదాలు వెతకడం ఒక పరిపాటిగా మారింది. కానీ, నిజమైన రాజకీయ పరిణితి ఏమిటంటే.. గెలుపు అనేది కేవలం ఒక అవకాశం మాత్రమే అని గుర్తించడం. ప్రజలు ఎవరికైనా అవకాశం ఇస్తారు, కానీ దానిని నిలబెట్టుకోవడం అనేది ఆ నాయకుడి నిరంతర పరీక్ష.

తమిళనాడు ఫలితాలు మళ్ళీ ఒక పాత నిజాన్ని చాటిచెప్పాయి. ప్రజలే ప్రభువులు. ఏ వ్యూహకర్త డైరీలోనూ, ఏ విశ్లేషకుడి మేధస్సులోనూ ఓటరు నాడి దొరకదు. అది కేవలం పోలింగ్ కేంద్రం దగ్గర మాత్రమే కనిపిస్తుంది. విజయ్ విజయం అనేది ఒక వ్యక్తి గెలుపు కంటే, మార్పు కోసం తహతహలాడిన తమిళ ఓటరు గెలుపుగా చూడాలి. మిగిలినవన్నీ ఆ గెలుపు చుట్టూ అల్లిన అభూత కల్పనలు మాత్రమే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360