తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు-2026 ఒక కొత్త చరిత్రను సృష్టించింది. సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా, టెక్నాలజీని జోడించి నిర్వహించిన ఈ హైబ్రిడ్ మోడల్ ఇప్పుడు దేశవ్యాప్త రాజకీయ పార్టీలకు ఒక సరికొత్త పాఠంగా మారింది.
ఒక రాజకీయ సమావేశంగానే కాకుండా, ఒక 'డిజిటల్ రెవల్యూషన్'గా నిలిచింది. ఒకే చోట లక్షలాది మందిని చేర్చడం కంటే, సాంకేతికత ద్వారా కోట్లాది మందిని అనుసంధానించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ హైబ్రిడ్ మోడల్ అద్భుత ఫలితాలను ఇచ్చింది.
ఇరవై లక్షల మంది అనుసంధానం
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా.. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1,875 డిజిటల్ క్లస్టర్ల ద్వారా సుమారు 20 లక్షల మంది కార్యకర్తలు, నాయకులు ఈ పండుగలో ప్రత్యక్షంగా భాగస్వాములయ్యారు. భౌగోళిక సరిహద్దులను చెరిపివేస్తూ సాగిన ఈ ప్రయోగం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఒక బహిరంగ సభను భారీ స్థాయిలో నిర్వహిస్తే ట్రాన్స్‌పోర్ట్, భోజనాలు , ఇతర సౌకర్యాల కోసం కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ముఖ్యంగా ఇంధన ధరల పెరుగుదల, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులతో చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం ఒక మాస్టర్ స్ట్రోక్ ' అని చెప్పాలి. ఖర్చును గణనీయంగా తగ్గించడమే కాకుండా, కార్యకర్తలకు వారి సొంత నియోజకవర్గాల్లోనే పండుగ వాతావరణం కల్పించడంలో ఈ మోడల్ సక్సెస్ అయింది. పెద్ద స్క్రీన్ల ద్వారా ప్రధాన వేదికకు అనుసంధానం కావడంతో, కార్యకర్తలు తమ తమ ప్రాంతాల్లోనే ఉండి నాయకత్వంతో ఎమోషనల్ బాండింగ్ ను పెంచుకున్నారు.
నారా లోకేష్ మార్క్ టెక్నాలజీ
ఈ హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ వెనుక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. మైటీడీపీ ప్లాట్‌ఫారమ్ ద్వారా జీపీఎస్ ఆధారిత డిజిటల్ ఆహ్వానాలు పంపడం, క్యూఆర్ కోడ్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ , ఐటిడిపి యాప్ ద్వారా రియల్ టైమ్ మానిటరింగ్ చేపట్టడం ఒక కార్పొరేట్ ఈవెంట్‌ను తలపించింది. స్టేడియంలో మ్యాచ్ చూసే అభిమాని సైతం పెద్ద స్క్రీన్ల పైనే ఆధారపడతాడు.. అదే సూత్రాన్ని ఇక్కడ అమలు చేస్తూ క్లస్టర్ల వారీగా కార్యకర్తలను ఒకచోట చేర్చి, వారిలో స్థానిక ఐక్యతను కూడా పెంచగలిగారు.
కేస్ స్టడీగా జాతీయ స్థాయి చర్చ
రానున్న రోజుల్లో ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఈ విధానం ఒక ఆదర్శంగా మారే అవకాశం ఉంది. దేశంలోనే ఐటీ రంగంపై అత్యంత అవగాహన ఉన్న నేతగా చంద్రబాబుకు ఉన్న పేరును ఈ మహానాడు మరోసారి నిరూపించింది. కేవలం ప్రసంగాలు వినడమే కాకుండా, క్లస్టర్ల నుంచి కార్యకర్తలు తమ అభిప్రాయాలను నేరుగా అధినేతకు చేరవేసే అవకాశం ఉండటం ఈ మోడల్ లోని గొప్పతనం. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియను మరింత విస్తృతపరచడాని, అందరినీ కలుపుకోవడానికి తోడ్పడింది. మహానాడు-2026 ఒక సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది. భవిష్యత్తులో రాజకీయ పార్టీలు భారీ బహిరంగ సభల కంటే, ఇలాంటి హైబ్రిడ్ పద్ధతుల ద్వారానే ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉంది.

