మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ , అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం అనలాగ్ సంస్థతో కలిసి సాంకేతిక రంగంలోకి సంచలన ఎంట్రీ ఇచ్చింది.
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం.. ఈ రెండు సంస్థలు కలిపి 50:50 భాగస్వామ్యంతో ఒక సరికొత్త జాయింట్ వెంచర్ ను ఏర్పాటు చేశాయి. భారతదేశంలోనే మొదటిసారిగా 'ఫిజికల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను తీసుకురావడానికి రాబోయే 3 నుండి 5 ఏళ్లలో దాదాపు రూ.2,500 కోట్ల నుండి రూ.4,000 కోట్లు భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు మేఘా ఎండీ పి. వి. కృష్ణా రెడ్డి అధికారికంగా ప్రకటించారు.
ట్రాఫిక్ మేనేజ్మెంట్‌లోకి 'మేఘా' గ్రూప్
హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీకి, ముఖ్యంగా భారీ వర్షాల సమయంలో తలెత్తే రోడ్డు దిగ్బంధనాలకు చెక్ పెట్టేందుకు మేఘా-అనలాగ్ సంయుక్త భాగస్వామ్యం ఒక పక్కా యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్ట్‌లో మేఘా పాత్ర అత్యంత కీలకం కానుంది. నగరంలోని సుమారుగా అన్ని ప్రధాన ట్రాఫిక్ జంక్షన్లను ఒకే తాటిపైకి తెస్తూ యూనిఫైడ్ ఇంటెలిజెంట్ సిస్టమ్ నెట్‌వర్క్‌ను క్షేత్రస్థాయిలో మేఘా గ్రూప్ నిర్మించనుంది. అనలాగ్ సంస్థ అందించే ఏఐ సాఫ్ట్‌వేర్, హైవ్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా.. రోడ్లపై రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సిగ్నల్ టైమింగ్స్‌ను డైనమిక్‌గా మార్చే అత్యాధునిక హార్డ్‌వేర్, సెన్సార్లు, కెమెరాల గ్రిడ్‌ను హైదరాబాద్ వ్యాప్తంగా మేఘా తన ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఇన్స్టాల్ చేయనుంది.
సచివాలయం చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం!
ఈ సరికొత్త ఏఐ సాంకేతికత పనితీరును పరీక్షించడానికి మేఘా-అనలాగ్ ఇప్పటికే హైదరాబాద్ నగరంలో క్షేత్రస్థాయి ట్రయల్స్ ప్రారంభించింది. తెలంగాణ సచివాలయం చుట్టూ ఉన్న 5 కిలోమీటర్ల పరిధిలోని అత్యంత కీలకమైన అంతర్గత మార్గాలలో ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను మేఘా గ్రూప్ రన్ చేస్తోంది. ఈ పరిధిలో ఏఐ అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా స్పందిస్తున్నాయి? వర్షాలు పడినప్పుడు నీటి నిల్వలను సెన్సార్లు ఎంత త్వరగా గుర్తిస్తున్నాయి? అనే అంశాలపై డేటాను సేకరిస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో, దీనిని పూర్తిస్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధి అంతటా విస్తరించడానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని ద్వారా అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజన్ల కోసం ఆటోమేటిక్ 'గ్రీన్ కారిడార్' రూట్ క్లియరెన్స్ సిస్టమ్‌ను కూడా మేఘా అందుబాటులోకి తేనుంది.
అన్ని సేవల్లోనూ ఏఐ విప్లవం!
ఈ భారీ భాగస్వామ్యం కేవలం హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ సిగ్నల్స్ మార్చడానికే పరిమితం కావడం లేదు. తాము దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న పవర్ గ్రిడ్స్, భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుల మెయింటెనెన్స్, వాటర్ సప్లై సిస్టమ్స్‌లో కూడా ఈ ఫిజికల్ ఇంటెలిజెన్స్ ను వాడుతామని మేఘా సంస్థ వెల్లడించింది. నగరాల్లో భూగర్భ తాగునీటి పైప్‌లైన్లలో జరిగే లీకేజీలను ముందే గుర్తించడం, విద్యుత్ లోడ్‌ను బట్టి పంపిణీని ఆప్టిమైజ్ చేయడం, అలాగే తాము తయారు చేస్తున్న ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను కూడా ఈ ఏఐ నెట్‌వర్క్‌తో అనుసంధానించనున్నారు.

