హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి వేడుకల వేళ నిమజ్జనం అంశంపై సరికొత్త వివాదం రాజుకుంది. నగరంలోని చెరువులు, జలాశయాల పునరుద్ధరణతో పాటు పర్యావరణ పరిరక్షణ బాధ్యతలను భుజానకెత్తుకున్న హైడ్రా, సాంప్రదాయబద్ధంగా ఉత్సవాలు నిర్వహిస్తున్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మధ్య భిన్నాభిప్రాయాలు ఘర్షణకు దారితీస్తున్నాయి.
జీహెచ్‌ఎంసీ, హైడ్రా ఆధ్వర్యంలో సుందరీకరించి, జీవవైవిధ్య కేంద్రాలుగా తీర్చిదిద్దిన చెరువుల్లో విగ్రహాల నిమజ్జనానికి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేస్తుండటమే ఈ వివాదానికి మూలకారణం.
ఎంతో కష్టంతో చెరువుల్ని పునరుద్ధరిస్తున్న హైడ్రా
హైడ్రా కమిషనర్ రంగనాథ్ నగరంలోని ప్రధాన చెరువులు పర్యావరణపరంగా అత్యంత కీలకమైనవని, వాటి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ , రసాయన రంగుల వల్ల నీరు కలుషితమై జీవవ్యవస్థ దెబ్బతింటుందని చెప్తున్నారు. అందుకే అభివృద్ధి చేసిన చెరువుల ప్రధాన జలాశయాల్లో కాకుండా, ప్రత్యామ్నాయంగా సమీపంలో ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్, ఇతర నిర్దేశిత ప్రాంతాల్లోనే విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచిస్తున్నారు.
చెరువుల్లోనే చేస్తామంటున్న ఉత్సవ సమితి నేతలు
అయితే ఈ నిబంధనలపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం భక్తులు తమ ఆచారాల మేరకు చెరువుల్లోనే నిమజ్జనం చేస్తారని, విగ్రహాలను అడ్డుకునే హక్కు లేదా అధికారం హైడ్రాకు లేదని స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో భక్తుల విశ్వాసాలను, సెంటిమెంట్‌ను దెబ్బతీయవద్దని, ఎప్పటిలాగే అన్ని చెరువుల్లోనూ, ట్యాంక్ బండ్ వంటి ప్రధాన ప్రాంతాల్లోనూ నిమజ్జనం చేసి తీరుతామని సమితి ప్రతినిధులు భీష్మించుకూర్చున్నారు.
పర్యావరణం చెడగొట్టడం మంచిదేనా?
ఈ ఘర్షణ వాతావరణం నగరంలో శాంతిభద్రతల సమస్యగా మారకుండా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం , పోలీసులు సమన్వయ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు పర్యావరణ పరిరక్షణ , న్యాయస్థానాల ఆంక్షలను అమలు చేయాల్సిన బాధ్యత హైడ్రాపై ఉండగా, మరోవైపు భక్తుల భావోద్వేగాలను కూడా పరిశీలనలోకి తీసుకోవడం ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా మారింది. ఉత్సవాలు సమీపిస్తున్న కొద్దీ ఈ హైడ్రా వర్సెస్ ఉత్సవ సమితి వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది.

