Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైకమాండ్‌ వల్లే  పతనం దిశగా తెలంగాణ కాంగ్రెస్ !

హైకమాండ్‌ వల్లే పతనం దిశగా తెలంగాణ కాంగ్రెస్ !

Telugu 360 6 days ago

తెలంగాణలో పదిలమైన స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ రోజురోజుకూ పడిపోవడానికి ప్రధాన కారణం ప్రతిపక్షాల వ్యూహాలు కాదు, స్వయంగా కాంగ్రెస్ అధిష్టానమే .

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనను ఎదుర్కొని, వీధిపోరాటాలు చేసి పార్టీని విజయతీరాలకు చేర్చిన రేవంత్ రెడ్డికి అధికారాన్ని సంపూర్ణంగా అప్పగించి, ఆయనకు భరోసాగా నిలవాల్సిన ఢిల్లీ పెద్దలు.. ఆయన్ను నియంత్రించేందుకు చూస్తుండటం పార్టీ గ్రాఫ్‌ను దెబ్బతీస్తోంది. ప్రాంతీయ స్థాయిలో తిరుగులేని నాయకత్వాన్ని నిర్మించుకోవడంలో ఢిల్లీ కాంగ్రెస్ వైఫల్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.

వైఎస్‌లా స్వేచ్ఛ ఇవ్వకూడదని టార్గెట్

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్లే కాంగ్రెస్ నిలబడింది. కానీ, ఆ తర్వాత వైఎస్సార్ కుమారుడు జగన్ వ్యవహారంలో అనుభవించిన అనుభవాలు, ప్రాంతీయ నాయకుడు మితిమీరిన బలం పుంజుకుంటాడనే అనవసర భయాలు అధిష్టానాన్ని నేటికీ వెంటాడుతున్నట్లుగా ఉంది. అందుకే రేవంత్ రెడ్డిని ఒక బలమైన ప్రాంతీయ నాయకుడిగా ఎదగనివ్వకుండా, అధిష్టానం ద్వారా చెక్ పెట్టే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. రేవంత్ ఎంత బలంగా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంత స్థిరంగా ఉంటుందన్న ప్రాథమిక సూత్రాన్ని హైకమాండ్ పక్కనబెడుతోంది.

రేవంత్ ను బలహీనం చేస్తున్న హైకమాండ్ రాజకీయాలు

అధిష్టానం ఇస్తున్న ఈ సంకేతాలు పార్టీలోని అంతర్గత విభేదాలకు మరింత ఊతమిస్తున్నాయి. కొండా సురేఖ, జీ చిన్నారెడ్డి , కొమటిరెడ్డి వంటి సొంత పార్టీ నేతలే బహిరంగంగా ముఖ్యమంత్రి వర్గానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నా, ఢిల్లీ పెద్దలు దాన్ని గట్టిగా కట్టడి చేయలేకపోవడమే అందుకు నిదర్శనం. క్రమశిక్షణా కమిటీ చర్యలను కూడా హోల్డ్‌లో పెట్టడం వల్ల ముఖ్యమంత్రి మాటకే అధిష్టానం వద్ద విలువ లేదా అనే సంకేతం కింది స్థాయికి వెళ్లిపోయింది. ఒక ముఖ్యమంత్రికి తన మంత్రివర్గాన్ని లేదా సొంత పార్టీ అసమ్మతిని అదుపు చేసే అధికారం లేకపోతే, అడ్మినిస్ట్రేషన్‌లో ఆయన పట్టు సడలిపోతుంది.

నష్టపోతోంది కాంగ్రెస్సే!

ఈ న్యూ గార్డ్ వర్సెస్ ఓల్డ్ గార్డ్ పోరు వల్ల అంతిమంగా నష్టపోతోంది తెలంగాణలో కాంగ్రెస్ స్థానమే. క్షేత్రస్థాయిలో పార్టీ కష్టపడే శ్రేణులు గందరగోళంలో పడుతుంటే, ప్రతిపక్షాలైన బీఆర్‌ఎస్, బీజేపీలు ఈ అసమ్మతిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యం కాచుకుని కూర్చున్నాయి. రేవంత్ రెడ్డికి పాలనలోనూ, పార్టీ నిర్ణయాల్లోనూ పూర్తి స్థాయి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోతే, అసమ్మతి మరింత ముదిరి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉంది. రేవంత్ రెడ్డి ఇమేజ్‌ను బలహీనపరిచే బదులు, ఆయన చేతులకు మరింత పవర్ ఇవ్వడం, ప్రభుత్వ బ్రాండ్‌ను పెంచడం ద్వారా మాత్రమే రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ పుంజుకోగలదు. లేని పక్షంలో తమ సొంత వ్యూహాల వల్ల తమకే నష్టం చేకూర్చుకుని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల ఆశలను వదులుకోవాల్సి వస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360