Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హోమ్‌లోన్ పాక్షిక ప్రీ పేమెంట్ వల్ల ఎంతో లాభం!

హోమ్‌లోన్ పాక్షిక ప్రీ పేమెంట్ వల్ల ఎంతో లాభం!

Telugu 360 3 weeks ago

ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం కారణంగా హోమ్ లోన్ వడ్డీ రేట్లు సామాన్యుల బడ్జెట్‌ను దాటిపోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను పెంచే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్న తరుణంలో, బ్యాంకులు తమ నిధుల వ్యయం పెరిగిందనే సాకుతో వడ్డీ భారాన్ని రుణగ్రహీతలపై వేస్తున్నాయి.

అందుకే పెరుగుతున్న ఈఎంఐల నుండి ఉపశమనం పొందేందుకు ప్రీ-పేమెంట్ అనేది ఒక శక్తివంతమైన ఆయుధమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

సాధారణంగా లోన్ తీసుకున్న పదేళ్ల పాటు అసలు కంటే వడ్డీయే ఎక్కువగా కట్టాల్సి వస్తుంది. అయితే, చాలా బ్యాంకులు ఇప్పుడు తమ ప్రీ-పేమెంట్ నిబంధనలను సరళతరం చేశాయి, కానీ ఈ విషయం చాలా మందికి చేరడం లేదు. ఫ్లోటింగ్ వడ్డీ రేట్లపై తీసుకున్న గృహ రుణాలకు ముందస్తు చెల్లింపులు చేసినప్పుడు బ్యాంకులు ఎటువంటి పెనాల్టీలు వసూలు చేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ, సామాన్యులు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. పండగ బోనస్‌లు లేదా అదనపు ఆదాయం వచ్చినప్పుడు అసలులో కొంత భాగం ముందస్తుగా చెల్లిస్తే, అది నేరుగా అసలు నుంచి తగ్గుతుంది, తద్వారా దీర్ఘకాలంలో లక్షలాది రూపాయల వడ్డీ భారం తగ్గుతుంది.

చాలామంది రుణగ్రహీతలు కేవలం నెలవారీ ఈఎంఐలు కడుతూ కాలపరిమితిని పెంచుకుంటూ పోతుంటారు. దీనివల్ల అసలు మొత్తం అలాగే ఉండి, వడ్డీ చక్రవడ్డీలా మారుతుంది. ఇలా కాకుండా, ఏటా ఒక అదనపు ఈఎంఐ చెల్లించడం , లోన్ మొత్తంలో ప్రతి ఏటా 5% నుండి 10% వరకు ముందస్తుగా కట్టడం వల్ల లోన్ కాలపరిమితి గణనీయంగా తగ్గుతుంది. బ్యాంకులు ఇప్పుడు ఆన్‌లైన్ పోర్టల్స్ ద్వారా కూడా ఈ ప్రీ-పేమెంట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి, దీనివల్ల బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంటి నుండే లోన్ భారాన్ని తగ్గించుకోవచ్చు.

ఇల్లు కొనేటప్పుడు కేవలం వడ్డీ రేట్లపైనే కాకుండా, ప్రీ-పేమెంట్ నిబంధనలు , ఫోర్ క్లోజర్ ఛార్జీలపై కూడా అవగాహన పెంచుకోవాలి. వడ్డీ రేట్లు మంట పుట్టిస్తున్న ఈ కాలంలో, సరైన ప్రణాళికతో చేసే ముందస్తు చెల్లింపులే సామాన్యుడికి చాలా మేలుచేస్తాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360