Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇక బీజేపీ టార్గెట్ బీఆర్ఎస్ నిర్వీర్యమే!

ఇక బీజేపీ టార్గెట్ బీఆర్ఎస్ నిర్వీర్యమే!

Telugu 360 5 days ago

తెలంగాణ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందన్న ఓ నమ్మకం రాజకీయవర్గాల్లో బలంగా ఉంది. బీజేపీని కేటీఆర్, కేసీఆర్ విమర్శించకపోవడం, రాష్ట్ర నేతల్లో కొంత మందిని మాత్రమే విమర్శించి అదే రాజకీయం అని సరిపెట్టుకోవడంతో ఏదో ఉందని అనుకుంటూ వస్తున్నారు.

అయితే ఇప్పుడు బండి భగీరథ కేసుతో రాజకీయం మారిపోయింది. బండి భగీరథ అంశాన్ని కేటీఆర్ ఎంత దూకుడుగా టేకప్ చేశారో… ఇది చల్లబడిన తర్వాత బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేసే బీజేపీ ప్లాన్ అంత కంటే ఎక్కువ దూకుడుగా ఉంటుందని బీజేపీ నేతలంటున్నారు. అదే జరిగితే… మరో రెండు నెలల తర్వాత నుంచి బీఆర్ఎస్‌కు అసలు మ్యూజిక్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

చాన్స్ కోసమే చూస్తున్న బీఆర్ఎస్

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్. బీజేపీ నుంచి తనను తాను కాపాడుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఎంపీ సీట్ల త్యాగం అందుకేనన్న ప్రచారమూ ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్‌లు కేంద్రంలోని బీజేపీ అధిష్ఠానాన్ని నేరుగా విమర్శించకుండా, కేవలం రాష్ట్ర స్థాయి నేతలను మాత్రమే టార్గెట్ చేస్తూ రాజకీయం నడపుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమనే సంకేతాలు కూడా వెలువడ్డాయి. కానీ, బండి భగీరథ కేసుతో ఈ పొత్తుల ఊహాగానాలకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. అవకాశం దొరికిన వెంటనే చట్టపరమైన అస్త్రాలతో తమను దారుణంగా దెబ్బకొట్టడానికి బీఆర్ఎస్ కాచుకుని కూర్చుందనే కఠిన వాస్తవం ఈ ఉదంతంతో బీజేపీ లీడర్‌షిప్‌కు స్పష్టమైంది.

బెంగాల్ తర్వాత తెలంగాణను టార్గెట్ పెట్టుకున్న బీజేపీ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన అఖండ విజయం తర్వాత జాతీయ స్థాయిలో ఫుల్ జోష్‌లో ఉన్న బీజేపీ అధిష్ఠానం, ఇప్పుడు తన తదుపరి ప్రధాన లక్ష్యంగా తెలంగాణను ఎంచుకుంది. బెంగాల్ మోడల్‌ను ఇక్కడ కూడా వర్తింపజేస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చాలని చూస్తున్న తరుణంలో, బీఆర్ఎస్ అనుసరిస్తున్న దూకుడు వ్యూహం బీజేపీని మరింత రెచ్చగొట్టేలా మారింది. ముఖ్యంగా బండి సంజయ్ కుటుంబాన్ని టార్గెట్ చేయడంతో ఇకపై బీఆర్ఎస్ పట్ల ఎలాంటి సానుభూతి ప్రదర్శించాల్సిన అవసరం లేదనే పక్కా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

రెండు నెలల్లో అసలు బీజేపీ రాజకీయం

ఈ తాజా ఉదంతం రాజకీయంగా కాస్త చల్లబడిన తర్వాత.. బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో పూర్తిగా నిర్వీర్యం చేయడమే ఏకైక లక్ష్యంగా బీజేపీ తన పూర్తి స్థాయి కార్యాచరణతో రంగంలోకి దిగబోతోందని పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. కేటీఆర్ ఈ ఇష్యూను ఎంత దూకుడుగా టేకప్ చేశారో, దానికి రెట్టింపు వేగంతో కౌంటర్ ప్లాన్‌ను అమలు చేయడానికి ఢిల్లీ పెద్దలు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు భావిస్తున్నారు. బీజేపీ వ్యూహాత్మక అడుగులు గమనిస్తే, మరో రెండు నెలల తర్వాత నుంచి తెలంగాణ రాజకీయాల్లో అసలైన పొలిటికల్ మ్యూజిక్ ప్రారంభం కాబోతోందని స్పష్టమవుతోంది. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కేడర్‌ను ఆకర్షిస్తుండగా, మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చట్టపరమైన, రాజకీయపరమైన వ్యూహాలతో బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని డిఫెన్స్‌లోకి నెట్టే ప్రమాదం కనిపిస్తోంది. ఇరువైపుల నుంచి వచ్చే దాడిని తట్టుకుని నిలబడటం గులాబీ దళానికి అతిపెద్ద సవాలుగా మారనుంది.

బండి భగీరథ కేసు కేవలం ఒక వ్యక్తిగత లేదా చట్టపరమైన వివాదంగా మిగిలిపోలేదు. దాన్ని ఆయుధంగా చేసుకున్న బీఆర్ఎస్..బీజేపీని టార్గెట్ చేసుకుంది. బీజేపీ కూడా టార్గెట్ చేయాల్సిన పరిస్థితిని కల్పించుకుంది. ఇదే రాజకీయాన్ని మారుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360