సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే సగటు మధ్యతరగతి కొనుగోలుదారుడికి హోమ్ లోన్ వడ్డీ రేట్లలో వచ్చే స్వల్ప మార్పు కూడా గణనీయమైన ప్రభావం చూపుతుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేటు తగ్గించినప్పుడు లేదా బ్యాంకులు వడ్డీ రేట్లను అర శాతం లేదా ఒక శాతం తగ్గించినప్పుడు.. తక్కువ వడ్డీకే రుణం లభిస్తుంది కాబట్టి వెంటనే ఇల్లు కొనడం మంచిదేనా అనే ప్రశ్న ప్రతీ ఒక్కరిలోనూ రేకెత్తుతుంది. అయితే, కేవలం వడ్డీ రేటు తగ్గడాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకుండా, ఇళ్ల రేట్ల ధరల పెరుగుదల ,నెలకు చెల్లించే అద్దెలను గణితాత్మకంగా పోల్చి చూసినప్పుడే అసలైన లాభనష్టాలు బోధపడతాయి.
ఉదాహరణకు, ఒక వ్యక్తి రూ. 50 లక్షల హోమ్ లోన్‌ను 20 ఏళ్ల కాలపరిమితికి 9% వడ్డీ రేటుతో తీసుకుంటే, ఆయన చెల్లించే నెలవారీ ఈఎమ్‌ఐ రూ. 44,986 అవుతుంది. మొత్తం 20 ఏళ్లలో చెల్లించే వడ్డీ అసలు కంటే ఎక్కువ, అంటే రూ. 57.96 లక్షలు అవుతుంది. ఒకవేళ వడ్డీ రేటు 8.5%కి తగ్గిందనుకుంటే, నెలవారీ ఈఎమ్‌ఐ రూ. 43,391కి తగ్గుతుంది. అంటే నెలకు రూ. 1,595 చొప్పున, మొత్తం 20 ఏళ్ల కాలంలో దాదాపు రూ. 3.82 లక్షల వరకు వడ్డీ ఆదా అవుతుంది. ఇక వడ్డీ 8%కి తగ్గితే ఈ ఆదా ఏకంగా రూ. 7.5 లక్షలకు చేరుకుంటుంది.
అయితే, ఇక్కడ గమనించాల్సిన ప్రధానాంశం ఏంటంటే.. హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గే వరకు వేచి చూడటం వల్ల ఆస్తి విలువ పెరిగే ప్రమాదం ఉంది. హైదరాబాద్ వంటి వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలు సగటున ఏడాదికి 8% నుండి 12% వరకు పెరుగుతున్నాయి. రూ. 60 లక్షల విలువైన ఫ్లాట్ కొనుగోలును వడ్డీ రేట్లు తగ్గుతాయనే ఆశతో రెండేళ్లు వాయిదా వేస్తే, ఆ ఫ్లాట్ ధర 10% వార్షిక పెరుగుదలతో దాదాపు రూ. 72.6 లక్షలకు చేరుకుంటుంది. అంటే, రెండేళ్లలో దాదాపు రూ. 12.6 లక్షలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. పైగా ఆ రెండేళ్లలో కట్టే ఇంటి అద్దె ఖర్చు అదనం.
అంతిమంగా, వడ్డీ రేటు 0.5% తగ్గడం వల్ల 20 ఏళ్లలో మీకు రూ. 3.8 లక్షలు ఆదా అయినప్పటికీ, కొనుగోలును రెండేళ్లు ఆలస్యం చేయడం వల్ల ఆస్తి ధర పెరిగి రూ. 17 లక్షల వరకు అదనపు భారం పడుతుంది. కాబట్టి గణితాత్మక కోణంలో చూస్తే.. స్థిరమైన ఆదాయం ఉండి, చెల్లించాల్సిన ముందస్తు డిపాజిట్ సిద్ధంగా ఉన్నప్పుడు, వడ్డీ రేట్ల కోసమో లేదా సరైన సమయం కోసమో వేచి చూడటం కంటే ఎంత త్వరగా సొంతింటి నిర్ణయం తీసుకుంటే అంత ఆర్థిక లబ్ధి చేకూరుతుంది.

