Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జగన్ లవ్స్ బీజేపీ -  నేరుగా చెప్పే సత్తా ఉందా?

జగన్ లవ్స్ బీజేపీ - నేరుగా చెప్పే సత్తా ఉందా?

Telugu 360 3 days ago

బీజేపీ అంశంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవలంబిస్తున్న వైఖరి మొదటి నుంచి వివాస్పదమే. ఆయన అక్రమ సంబంధాన్ని నడుపుతున్నారని ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చేయలేరు.

బీజేపీతో కలిసి ఉన్నామంటారు. అలాగే ప్రచారం చేసుకుంటారు. కానీ బయటకు మాత్రం చెప్పరు. జగన్ రెడ్డికి నిజంగానే రాజకీయ దమ్ము, ధైర్యం ఉంటే.. తాము బీజేపీతోనే ఉంటామని, ఆ పార్టీతో పొత్తుకు సిద్ధమని బహిరంగంగా ప్రకటించాలి. లేదా తాము ఆ పార్టీ సిద్ధాంతాలను, కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేస్తూ ప్రత్యక్ష యుద్ధానికైనా సిద్ధం కావాలి. ఈ రెండు కాకుండా ముసుగులో గుద్దులాట ఆడటం రాజకీయ చేతకానితనమే. జగన్‌ లచేస్తోంది అదే.

పెట్రోల్ ధరలపై పోరు.. కానీ కేంద్రంపై విమర్శలు నిల్!

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలపై వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు, నిరసనలు చేపట్టింది. రాష్ట్ర ప్రజల పక్షాన పోరాడుతున్నట్లు కలరింగ్ ఇస్తూ వీధుల్లోకి వచ్చిన వైసీపీ నేతలు.. ఆశ్చర్యకరంగా ఎక్కడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు కానీ, కేంద్ర ప్రభుత్వ విధానాలను కానీ గట్టిగా తప్పుపట్టలేదు. కేవలం ధరలు పెరిగాయంటూ రాస్తారోకోలు చేయడం వెనుక ఉన్న అంతరార్థం స్పష్టంగానే కనిపిస్తోంది. రాష్ట్రంలో తాము బీజేపీకి వ్యతిరేకమనే సంకేతాలు పంపుతూనే, దిల్లీ పెద్దలు నొచ్చుకోకుండా జాగ్రత్తపడటం జగన్ మార్కు ద్వంద్వ నీతి కి అద్దం పడుతోంది. ఈ తరహా రాజకీయ నాటకాలు ప్రజలను ఎంతమాత్రం నమ్మించలేవు.

కేసుల రక్షణే పరమార్థం.. మోదీ-షా అండపైనే ఆశలు

జగన్ రెడ్డి ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించడం వెనుక ఉన్న ఏకైక బలహీనత.. ఆయనపై ఉన్న సీబీఐ, ఈడీ అక్రమాస్తుల కేసులు. మోదీ, అమిత్ షాల ఆశీస్సులు ఉంటే తనను ఎవరూ ఏమీ చేయలేరని, కేసులు ముందుకు పడకుండా కాపాడుకోవచ్చనే ఏకైక ఎజెండాతోనే ఆయన రాజకీయం సాగుతోందనేది బహిరంగ రహస్యం. ఇటీవల బీజేపీ నేతలు సైతం జగన్ జైలుకు వెళ్లడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నా, వైసీపీ అగ్రనాయకత్వం నుంచి గట్టి కౌంటర్ రాకపోవడమే ఈ బలహీనతకు నిదర్శనం. చట్టం నుంచి, విచారణల నుంచి తప్పించుకోవడానికి జాతీయ పార్టీని అడ్డం పెట్టుకోవడం పాలకుడిగా ఆయన వైఫల్యాన్ని, రాజకీయ దివాళాకోరుతనాన్ని చూపిస్తోంది.

లౌకికవాద ముసుగులో సొంత ఓటు బ్యాంకుకు ద్రోహం

రాష్ట్రంలో ముస్లిం, క్రైస్తవ మైనారిటీ ఓట్లు ఆయనకే వేస్తారు. కాంగ్రెస్ ను కాదని ఆయన వెంటే ఉంటున్నారు. గెలిచిన నాలుగు సీట్లు వారి వల్లే గెలిచారు. అయినా పార్లమెంట్‌లో మాత్రం ఎన్డీఏ బిల్లులకు బేషరతుగా మద్దతు పలికిన చరిత్ర వైసీపీది. ఈ ముసుగు రాజకీయాలు ఇకపై సాగవని గ్రహించే, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి అనుకూల విశ్లేషకులతో యూట్యూబ్ ఛానెళ్లలో కొత్త సిద్ధాంతాలు వండించి, వాటిని సొంత మీడియాలో బ్యానర్ కథనాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఒకవైపు అధికార కూటమి లో చిచ్చు పెట్టడానికి బీజేపీ అంశాన్ని వాడుకుంటూనే, మరోవైపు దిల్లీలో అదే బీజేపీతో అంతర్గత స్నేహం కోసం తాపత్రయపడటం నమ్ముకున్న ఓటర్లను నిలువునా ముంచడమే. ఈ తిమ్మిని బమ్మి చేసే రాజకీయం వల్లే వైసీపీ తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోతోంది.

స్పష్టత లేని రాజకీయం పతనానికి దారితీస్తుంది

రాజకీయాల్లో ఏ పార్టీకైనా సిద్ధాంతపరమైన స్పష్టత ఉండాలి. ఒక పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం దిల్లీకి లొంగిపోతున్నామని చెబుతూ, మరోపక్క రాజకీయ రక్షణ కోసం మోకరిల్లడం లౌకికవాదం అనిపించుకోదు. జగన్ రెడ్డి ఇప్పటికైనా తన ముసుగును తొలగించి, బీజేపీతో తమకున్న బంధం ఏమిటో ప్రజల ముందు నిర్మొహమాటంగా ఒప్పుకోవాలి. లేకపోతే అటు లౌకికవాదాన్ని నమ్మి ఓటేసిన మైనారిటీల విశ్వాసాన్ని కోల్పోవడంతో పాటు, ఇటు దిల్లీ పెద్దల వ్యూహాత్మక చదరంగంలో వైసీపీ ఒక పావుగా మిగిలిపోయి రాజకీయంగా మరింత పతనం కావడం ఖాయం. ఈ విషయం అంతా అయిపోయాక గుర్తిస్తే ప్రయోజనం ఉండదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360