జనసేన పార్టీ సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మూర్ఖుడిగా తేల్చారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘోర పరాభవానికి, వ్యక్తిగతంగా తన ఓటమికి జగన్ మోహన్ రెడ్డి అనుసరించిన ఒంటెద్దు పోకడలు, మూర్ఖత్వపు నిర్ణయాలే కారణమని స్పష్టం చేశారు.
తాను ఏనాడూ పదవుల కోసం ఆశపడలేదని, జనసేనలో పదవులు అడగడానికి తనకు ఎలాంటి అర్హత ఉందో కూడా తనకు తెలుసంటూనే.. జగన్ నాయకత్వ లోపాలను ఎండగట్టారు.
జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనపై బాలినేని తీవ్రమైన నిరసన వ్యక్తం చేశారు. సీఎం సీట్లో కూర్చుని కేవలం బటన్లు నొక్కడం' తప్ప జగన్ రాష్ట్రానికి, ప్రజలకు సాధించింది ఏమీ లేదన్నారు. నేను గత ఎన్నికల్లో ఓడిపోవడానికి నా వ్యక్తిగత కారణాలు ఏవీ లేవు. కేవలం జగన్ పరిపాలనా వైఫల్యాలు, పార్టీ నడిపిన తీరు వల్లే ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు అని బాలినేని తేల్చేశారు. వైఎస్సార్‌సీపీని ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేయడం, నాయకులను కలుపుకుని పోవడం జగన్ రెడ్డికి అస్సలు చేతకావడం లేదని మండిపడ్డారు.
మూడు రాజధానుల పేరిట కాలయాపన చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ఆనాడు తాను కుటుంబాల జోలికి వెళ్లొద్దని వారించినా జగన్ వినలేదన్నారు. జగన్ మూర్ఖత్వపు నిర్ణయాలకు మావిగన్ నిదర్శనమని, ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఈ మావిగన్ ఏమైందని నిలదీశారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే ప్రజలను భ్రమల్లో ముంచడానికి ఇటువంటి సరికొత్త నాటకాలు ఆడుతున్నారని, వాటిని ఎవరూ నమ్మరని తేల్చిచెప్పారు. జగన్ రెడ్డికి దిల్లీకి వెళ్లి కేంద్రాన్ని నేరుగా ప్రశ్నించే ధైర్యం లేదని, కేవలం రాష్ట్రంలో కూర్చుని విపక్షాలపై అడ్డగోలు విమర్శలు చేయడం ఆయన చేతకానితనానికి నిదర్శనమని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఒంటెద్దు పోకడల వల్లే సీనియర్ నేతలంతా వైసీపీకి దూరమయ్యారని, భవిష్యత్తులో ఆ పార్టీ మరింత పతనం కావడం ఖాయమని బాలినేని వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

