Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జగన్‌ల నుంచి రక్షణ -  ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ !

జగన్‌ల నుంచి రక్షణ - ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ !

Telugu 360 1 hr ago

స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ, ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ ఎన్నడూ చూడని పెను పారిశ్రామిక సంక్షోభాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు మిగిల్చారు.

సాధారణంగా దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలు మారినప్పుడు రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, అంతకుముందు ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టులను, పెట్టుబడుల ఒప్పందాలను కొనసాగించడమే ఒక ఆరోగ్యకరమైన పరిపాలనా సంప్రదాయంగా వస్తోంది. నాడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ట్రాక్ మీదకు తెచ్చిన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కారిడార్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎక్కడా ఆపకుండా ముందుకు తీసుకెళ్లాయి. కానీ జగన్ రెడ్డి మాత్రం ఆ ప్రజాస్వామ్య సంప్రదాయాలన్నింటినీ తుంగలో తొక్కి, కేవలం రాజకీయ కక్షసాధింపు కోసం రాష్ట్రాభివృద్ధిని, పారిశ్రామిక పెట్టుబడులను బలిపీఠంపైకి ఎక్కించారు.

పెట్టుబడిదారులందరికీ వేధింపులు

గత ప్రభుత్వ హయాంలో అంతర్జాతీయ ఒప్పందాలైన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయడం, అమరావతి వంటి రాజధాని ప్రాజెక్టును నిలిపివేయడం, లులూ గ్రూప్ వంటి అంతర్జాతీయ సంస్థలను వేధించి రాష్ట్రం నుంచి వెళ్లగొట్టడం వంటి విపరిణామాలు కేవలం ఏపీకే కాకుండా యావత్ భారతదేశ బిజినెస్ ఎకోసిస్టమ్ ప్రతిష్టకే తీవ్ర విఘాతం కలిగించాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వం సంతకం చేసిన అధికారిక ఒప్పందాలకు కనీస విలువ లేకుండా పోవడంతో, దేశ విదేశాల ఇన్వెస్టర్లలో తీవ్ర అభద్రతాభావం నెలకొంది. జగన్ లాంటి విధ్వంసక మనస్తత్వం కలిగిన నాయకులు రాజకీయాల్లో ఉన్నంతకాలం.. రేపు మళ్లీ ఏదైనా పొరపాటు జరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమైతే తమ వేల కోట్ల రూపాయల పెట్టుబడుల పరిస్థితి ఏమిటన్న సహజమైన భయం పారిశ్రామికవేత్తలను వెంటాడటం అత్యంత సహజం.

ఇన్వెస్ట్ మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తెస్తున్న సీఎం

పెట్టుబడిదారుల మనసుల్లో గూడుకట్టుకున్న ఈ భయాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టి, వారికి చట్టబద్ధమైన రక్షణ కల్పించడమే అత్యవసరమని గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక విప్లవాత్మక అడుగు వేశారు. రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులను రాజకీయ మార్పులు, కక్షసాధింపులకు అతీతంగా రక్షించేందుకు ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకురావాలని నిర్ణయించారు. వచ్చే నెలలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో ఈ కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రతిపాదిత చట్టం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులను పూర్తిగా పాలిటిక్స్-ప్రూఫ్ గా మారుస్తామని, ఒకసారి రాష్ట్రంలో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ఒప్పందాలు, భూకేటాయింపులు, ప్రోత్సాహకాలను మార్చే అవకాశం ఉండదని చంద్రబాబు బలంగా విశ్వసిస్తున్నారు.

కేంద్రం కూడా ఇలాంటి రక్షణలు తేవాలి!

ఇక్కడ అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఈ చట్టం ముసాయిదాను పరిశీలన నిమిత్తం కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్న తరుణంలో, కేంద్రం కేవలం ఏపీ బిల్లుకు ఆమోదముద్ర వేయడంతోనే సరిపెట్టుకోకూడదు. అంతర్జాతీయ స్థాయిలో మేక్ ఇన్ ఇండియా నినాదంతో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం, ఏపీ తరహాలోనే జాతీయ స్థాయిలో కూడా ఇలాంటి ఒక కఠినమైన ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ చట్టాన్ని తీసుకురావడానికి కృషి చేయాలి. ఏ రాష్ట్రంలోనైనా అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు పాత ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేస్తే కఠినమైన ఆర్థిక, చట్టపరమైన జరిమానాలు ఎదుర్కొనేలా కేంద్ర చట్టం ఉంటేనే గ్లోబల్ ఇన్వెస్టర్లకు భారతదేశంపై సంపూర్ణ విశ్వాసం ఏర్పడుతుంది.

అత్యంత సురక్షితమైన పెట్టుబడి గమ్యస్థానంగాఏపీ

రాజకీయ నాయకుల అహంకారాలకు, కక్షసాధింపు చర్యలకు ఒక రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు, లక్షలాది మంది యువత ఉద్యోగావకాశాలు బలికాకూడదంటే ఇలాంటి చట్టబద్ధమైన రక్షణ కవచం నేటి తక్షణ అవసరం. విశాఖ సీఐఐ సదస్సు వేదికగా చంద్రబాబు ప్రకటించిన ఈ చట్టం అమల్లోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత సురక్షితమైన పెట్టుబడుల స్వర్గధామంగా అవతరించడమే కాకుండా.. భవిష్యత్తులో ఏ పాలకుడూ పరిశ్రమల జోలికి రావాలంటేనే వణికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దేశ పారిశ్రామిక ప్రగతికి దిక్సూచిగా నిలిచే ఈ చంద్రబాబు మార్క్ సంస్కరణ ఇతర రాష్ట్రాలకు సైతం ఒక గొప్ప మార్గదర్శిగా నిలవడం ఖాయం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360