Dailyhunt
జమ్మలమడుగు ఆది - రాజీనామా చేస్తారట!

జమ్మలమడుగు ఆది - రాజీనామా చేస్తారట!

Telugu 360 5 days ago

డప జిల్లా రాజకీయాల్లో జమ్మలమడుగు ఒకప్పుడు వర్గపోరుకు కేంద్రం. ఇప్పుడు అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, సొంత నియోజకవర్గంలో ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నారనే భావన ఈ మధ్య ఆయన మాటల్లో వ్యక్తమవుతోంది. అందుకే రాజీనామా చేస్తా అంటున్నారు.

సొంత నియోజకవర్గంలో పట్టు కోసం ఆరాటం

జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డికి ఉన్న అతిపెద్ద సమస్య నియోజకవర్గంలో ఆధిపత్యం. కూటమి ఒప్పందంలో భాగంగా ఇక్కడ టీడీపీకి చెందిన భూపేష్ రెడ్డి కూడా క్రియాశీలకంగా ఉన్నారు. ప్రభుత్వ పథకాలు, నామినేటెడ్ పదవులు లేదా స్థానిక పోలీసు వ్యవస్థపై పట్టు విషయంలో ఆదినారాయణరెడ్డి వర్గానికి, భూపేష్ రెడ్డి వర్గానికి మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. తన కళ్ళ ముందే ప్రత్యర్థి వర్గం చెయ్యి పైచేయి కావడం, ఎమ్మెల్యేగా ఉన్నా తన మాట నెగ్గకపోవడం ఆయన్ని తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. భూపేష్ రెడ్డి ఎవరో కాదు ఆయన సోదరుడి కుమారుడు. తన రాజకీయ వారసుడిగా కూడా గతంలో ఆదినారాయణ రెడ్డి చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం రాజకీయం చేస్తున్నారు.

గతంలోలో దందాలు చేయలేకపోతున్నా వైనం

జమ్మలమడుగులో అదానీ గ్రూప్ చేపట్టిన పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ విషయంలో కూడా ఆదినారాయణరెడ్డి వర్గానికి, కంపెనీ యాజమాన్యానికి మధ్య విభేదాలు తలెత్తాయి. గతంలో ఆయన అనుచరులు అదానీ ఆఫీసుపై దాడి చేసినట్లు ఆరోపణలు రావడం, దానిపై కేసులు నమోదు కావడం ఆయనకు మింగుడుపడటం లేదు. నియోజకవర్గంలో జరుగుతున్న భారీ ప్రాజెక్టులలో తన ప్రమేయం లేదా తన అనుచరులకు లబ్ధి చేకూరకపోవడం కూడా ఆయన అసహనానికి ఒక కారణమని తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా, కూటమి ప్రభుత్వంలో తన వర్గానికి సరైన ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన భావిస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద తన కంటే భూపేష్ రెడ్డికే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోందనేది ఆయన ప్రధాన ఫిర్యాదు. ఈ క్రమంలోనే తన ఉనికిని చాటుకోవడానికి రాజీనామా అనే మాటను ఆయన తరచుగా వాడుతున్నట్లు కనిపిస్తోంది.

బ్లాక్ మెయిల్ పాలిటిక్సా? నిజమైన ఆవేదనా?

ఆదినారాయణరెడ్డి రాజీనామా చేస్తానని అనడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన పలుమార్లు ఇలాగే ప్రకటించారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కేవలం బ్లాక్ మెయిల్ తంత్రమా లేక నిజంగానే ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటారా అనేది సందేహమే. జమ్మలమడుగులో తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి మరిన్ని తను కావాల్సిన పనులు చేయించుకోవడానికి. ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360