Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జీతం లక్ష - ఆస్తులు వందల కోట్లు !

జీతం లక్ష - ఆస్తులు వందల కోట్లు !

Telugu 360 5 days ago

హైదరాబాద్ మహానగర నీటి సరఫరా, మురుగునీటి పారుదల సంస్థ రెడ్ హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ కుమార్ నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ సోమవారం తెల్లవారుజాము నుంచి జరిపిన మెరుపు దాడులు తీవ్ర సంచలనం రేకెత్తించాయి.

డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ సారథ్యంలో ఏకకాలంలో ఎనిమిది ప్రాంతాల్లో సాగిన ఈ సోదాలు ప్రభుత్వ యంత్రాంగంలో వేళ్లూనుకున్న అవినీతి స్థాయికి అద్దం పడుతున్నాయి. ఒక ప్రభుత్వ అధికారి ఇల్లేనా లేదా ఏదైనా కార్పొరేట్ సంస్థ లాకర్లా అనేంతగా దొరికిన నగదు, బంగారం చూసి స్వయంగా దర్యాప్తు అధికారులే విస్తుపోయారు.

ఈ దాడుల్లో ప్రాథమికంగా లభించిన ఆధారాల ప్రకారం.. ఏకంగా రూ.1.05 కోట్ల నగదు, కిలోకు పైగా బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతో పాటు అత్యంత ఖరీదైన ఆస్తి పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్‌లోని ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీలలో 3 విలాసవంతమైన ఫ్లాట్లు, 6 ఓపెన్ ప్లాట్లు, నిజామాబాద్ జిల్లాలో 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ దాదాపు రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. బ్యాంకు లాకర్లను కూడా తెరిచి శోధిస్తే ఈ అక్రమ ఆస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం జలమండలిలో జనరల్ మేనేజర్ కేడర్ అధికారి అధికారిక జీతభత్యాలు అన్ని కలుపుకున్నా నెలకు లక్షన్నర నుండి రెండు లక్షల రూపాయల లోపే ఉంటాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన జీవితకాలంలో సంపాదించే చట్టబద్ధమైన మొత్తం ఆదాయాన్ని లెక్కించినా.. అది కొన్ని కోట్ల రూపాయలు దాటడం గగనం. మరి అలాంటప్పుడు, నెలకు వచ్చే పరిమిత జీతంతో వందల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించగలిగారు? ఐటీ కారిడార్లలోని ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీలలో ఫ్లాట్లు కొనే స్థాయికి ఈ ఆదాయం ఎక్కడి నుండి వచ్చింది?, అడ్డగోలుగా దోచుకోవడం వల్లనే వచ్చాయి.

ఈ స్థాయి లగ్జరీ ఆస్తుల వెనుక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన అనుమతులు, వాటర్ కనెక్షన్ల జారీ, మౌలిక వసతుల కాంట్రాక్టుల్లో జరిగిన భారీ అవినీతి నెట్‌వర్క్ దాగి ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో కమర్షియల్, రెసిడెన్షియల్ బిల్డింగ్‌లకు నీటి సరఫరా లైన్లు వేసే ప్రక్రియలో అడ్డగోలుగా చేతులు మారిన లంచాలే ఈ వందల కోట్ల అక్రమాస్తులకు మూలం. కానీ ఇతడే మరో రెండు నెలల తర్వాత విధుల్లో ఉంటాడు. ఆ మాఫియాను ఎవరైనా కదిలించగలరా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360