ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఐటీ, సోషల్ మీడియా వేదికగా సాగుతున్న షాడో వార్ ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై నిరంతరం యూట్యూబ్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పిస్తూ..
వైసీపీ ఎకోసిస్టమ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం పొందిన యూట్యూబ్ జర్నలిస్ట్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై ఆ పార్టీ అకస్మాత్తుగా చేతులెత్తేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రశ్న రావణ్ అనే వ్యక్తికి, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించేశారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన వివరణలో రావణ్ అనే వ్యక్తి తమ పార్టీకి చెందినవాడు కాదని, తాము అతడిని ఎక్కడి నుంచో తీసుకువచ్చి కూటమి ప్రభుత్వంపై మాట్లాడించలేదని డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్లారు. సదరు వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్‌ను, ఆయన విధానాలను మాత్రమే ప్రశ్నించాడని, దానికి తమకు ముడిపెట్టడం సరికాదని చెప్పుకొచ్చారు. అయితే, నిన్నటివరకు తమ అనుకూల సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో రావణ్ వీడియోలను విపరీతంగా షేర్ చేస్తూ, ఓ రేంజ్‌లో ఓనర్‌షిప్ తీసుకున్న వైసీపీ నేతలు.. ఇప్పుడు ఇంతలా ప్లేట్ ఫిరాయించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు.
రావణ్ కు సంబంధించిన కొన్ని పాత వీడియోలు సోషల్ మీడియాలో బయటకు రావడం, అవి తీవ్ర దుమారం రేపడంతోనే వైసీపీ ఈ వ్యూహాత్మక యూ-టర్న్ తీసుకుంది. రావణ్ గతంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పై అత్యంత ఘోరమైన, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు.. ఏకంగా దేశ సార్వభౌమత్వానికి, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దేశ వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తిని నెత్తిన పెట్టుకుంటే.. బీజేపీకి కోపం వస్తుందని వైసీపీ భయపడుతోంది.
దీంతో రావణ్‌ను ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదనే భావనకు వైసీపీ అగ్రనాయకత్వం వచ్చింది. అందుకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో ఇలాంటి ప్రకటనలు ఇప్పించారు. ఉపయోగించుకున్నంత కాలం వాడుకుని, తప్పులు బయటపడగానే ఆయన ఎవరో మాకు తెలియదు అని చేతులెత్తేయడం వైసీపీ పాత అలవాటేనని, తాజాగా ప్రశ్న రావణ్ కూడా అదే యూజ్ అండ్ త్రో వ్యూహానికి బలయ్యాడని పెద్దిరెడ్డి వ్యాఖ్యలతో స్పష్టమయింది.
