Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాక్రోచ్ జనతా పార్టీ - ఉద్యమం అవుతుందా?

కాక్రోచ్ జనతా పార్టీ - ఉద్యమం అవుతుందా?

Telugu 360 4 days ago

డిజిటల్ ప్రపంచంలో ఏ చిన్న నిప్పురవ్వ దొరికినా అది క్షణాల్లో కార్చిచ్చులా మారడం సర్వసాధారణం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కోర్టు విచారణ సందర్భంగా నకిలీ డిగ్రీల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ కొందరు నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ పేరిట సరికొత్త సెటైరికల్ పార్టీని తెరపైకి తెచ్చారు.

సోమరులు, నిరుద్యోగుల గళం అనే నినాదంతో సాగుతున్న ఈ ట్రెండ్.. జెన్ జీ ఉద్యమంగా మారుతుందని కొంత మంది అంచనాలు ప్రారంభించారు.

సీజేఐ వ్యాఖ్యల వక్రీకరణ.. యువతను రెచ్చగొట్టే వ్యర్థ ప్రయత్నాలు

అసలు ఈ వివాదానికి మూలం ఎక్కడుందో గమనిస్తే.. కోర్టులో నకిలీ సర్టిఫికెట్లతో ప్రొఫెషన్లలోకి వస్తున్న వారిని ఉద్దేశించి సీజేఐ మాట్లాడారు. ఆ తర్వాత ఆయన స్వయంగా స్పందిస్తూ.. తన వ్యాఖ్యలు దేశ యువతను ఉద్దేశించినవి కావని, భారత యువత ఈ దేశ ప్రగతికి బలమైన స్తంభాలని స్పష్టమైన వివరణ ఇచ్చారు. అయినప్పటికీ, మోదీ ప్రభుత్వాన్ని డిజిటల్ వేదికగా ఎలాగైనా ఇరుకున పెట్టాలనే ఏకైక ఎజెండాతో ఉన్న కొన్ని వర్గాలు ఈ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా అన్వయించుకున్నాయి. యువతలో నిరాశను, నిరుద్యోగ సెంటిమెంట్‌ను రగిల్చేందుకు దీనికి ఒక పొలిటికల్ మీమ్ రంగు పులిమి వైరల్ చేశాయి. కేవలం స్క్రీన్లకే పరిమితమయ్యే ఇటువంటి ఆన్‌లైన్ ట్రెండ్స్ క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పునూ తీసుకురాలేవు.

మోదీ ప్రభుత్వ పరిణతిపైనే దేశానికి నమ్మకం

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, యుద్ధ వాతావరణం, ఆర్థిక అనిశ్చితులను చూస్తే భారతదేశం ఎంత సురక్షితమైన చేతుల్లో ఉందో అర్థమవుతుంది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు వంటి అంతర్జాతీయ సవాళ్లను మోదీ ప్రభుత్వం అత్యంత దౌత్యపరమైన పరిణతితో, చతురతతో డీల్ చేస్తూ వస్తోంది. అంతర్జాతీయంగా ఎన్నో దేశాలు ఆర్థిక సంక్షోభాల్లో కూరుకుపోతున్నా, భారతదేశం స్థిరమైన వృద్ధిరేటుతో ముందుకు సాగడానికి కేంద్రం తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలే ప్రధాన కారణం. దేశాన్ని ఒక సంక్షోభం నుంచి కాపాడుతున్న పాలకుల వ్యూహాలను గమనిస్తున్న సామాన్య ప్రజలు, ఇటువంటి ఆన్‌లైన్ మీమ్ పార్టీల ప్రచారాలను కేవలం వినోదంగానే చూస్తారు తప్ప సీరియస్‌గా తీసుకోరని అనుకోవచ్చు.

నియంత్రణలు లేవు.. కేవలం హెచ్చరికలు మాత్రమే!

దేశంలో స్వేచ్ఛను హరిస్తున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారంలోనూ ఎలాంటి నిజం లేదు. విదేశీ మారకద్రవ్యం, బంగారం దిగుమతులపై ఆంక్షల వంటి విషయాల్లో ప్రభుత్వం కేవలం దేశ ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు చెబుతోందే తప్ప, సామాన్యుల జీవితాలను ఎక్కడా నిర్బంధించడం లేదు. ప్రజల ఆర్థిక మూలాలను కాపాడేందుకు వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలను కూడా తప్పుపడుతూ.. యువతను తప్పుదోవ పట్టించాలని చూసే కుయుక్తులు దేశానికి కూడాప్రమాదకరమే.

ఒక్క శాతం కూడా ఉద్యమంగా మారే ఛాన్స్ లేదు!

గతంలో ఇండియా అగైన్స్ట్ కరప్షన్ వంటి క్షేత్రస్థాయి ప్రజా ఉద్యమాలకు, నేటి కాక్రోచ్ జనతా పార్టీ లాంటి డిజిటల్ గిమ్మిక్కులకు నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఎక్స్ వేదికగా టైమ్ పాస్ కోసం, కాస్త నవ్వుకోవడం కోసం జెన్ జీ యువత ఈ ట్రెండ్‌ను వాడుకుంటోందే తప్ప, ఇందులో ఎలాంటి రాజకీయ చైతన్యం లేదు. జాతీయ భద్రత, ఆర్థిక స్థిరత్వానికి పెద్దపీట వేసే భారతదేశంలో.. ఇటువంటి ఆన్‌లైన్ మీమ్ సంస్కృతి ఒక నిరసన ఉద్యమంగా మారే అవకాశం ఒక్క శాతం కూడా లేదు. కేవలం కొన్ని రోజులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసి, ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోయే మరో తాత్కాలిక బుడగ మాత్రమే ఈ కాక్రోచ్ ట్రెండ్.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360