భారత రాజకీయాల్లో ప్రతిపక్షాల కాన్ఫిడెన్స్ , ప్రధానమంత్రి అభ్యర్థిత్వం ఎప్పుడూ ఒక సంక్లిష్టమైన సమీకరణమే. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ సహజ సిద్ధమైన ప్రధానమంత్రి అభ్యర్థి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అయితే, సాధారణ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌కు స్పష్టమైన సొంత మెజారిటీ రాకుండా, మిత్రపక్షాల మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం కథ మారిపోతుంది. గత చరిత్రను గమనించినా.. తణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ లేదా దక్షిణ భారత్‌కు చెందిన ప్రాంతీయ శక్తులు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ఏకగ్రీవంగా అంగీకరించడం ఎప్పుడూ పెద్ద సవాలే.
విజయ్ పేరు ఆషామాషీ కాదు!
ఇలాంటి ఉద్రిక్త సమయాల్లో మిత్రపక్షాల మధ్య సర్వసమ్మతమైన నాయకుడి అన్వేషణ మొదలవుతుంది. జాతీయ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉండి వివాదాస్పదులైన పాత ముఖాల కంటే, ఎవరికీ రాజకీయ శత్రువు కాని ఒక సరికొత్త ప్రత్యామ్నాయం వైపు విపక్షాలు మొగ్గు చూపడం భారత ప్రజాస్వామ్యంలో కొత్తేమీ కాదు. 1996లో హెచ్.డి. దేవేగౌడ , ఐ.కె. గుజ్రాల్ ప్రధానులు కావడం దీనికి చారిత్రాత్మక నిదర్శనాలు. ఈ క్రమంలోనే, తమిళనాడు రాజకీయాన్ని శాసిస్తూ జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షిస్తున్న తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్ పేరు ఒక ఆసక్తికరమైన ప్రత్యామ్నాయంగా తెరపైకి వస్తోంది.
రాహుల్‌కు చాన్స్ లేని చోట.. విజయ్‌కు అవకాశం
ఇటీవలే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావాన్ని చూపి, జాతీయ సర్వేల్లో కూడా ప్రతిపక్షాల ప్రధాని రేసులో అనూహ్యంగా మూడో స్థానంలో నిలిచిన విజయ్.. మిత్రపక్షాలకు ఒక అనుకూలమైన చాయిస్ కాగల అవకాశాలను తోసిపుచ్చలేం. ఆయనకు జాతీయ స్థాయిలో సుదీర్ఘ సిద్ధాంత పోరాటాల మరకలు లేకపోవడం, ప్రాంతీయ పార్టీల మధ్య ఎవరికీ రాజకీయంగా ముప్పుగా మారకపోవడం, దక్షిణాదికి చెందిన పాపులర్ మాస్ లీడర్ కావడం మిత్రపక్షాలకు ప్లస్ పాయింట్ కావచ్చు. కాంగ్రెస్ అభ్యర్థిపై ప్రాంతీయ నేతల్లో విభేదాలు వస్తే, కాంగ్రెస్‌తో సహా మిగిలిన కూటమి నేతలను ఒకే తాటిపైకి తెచ్చే న్యూట్రల్ ఫేస్ గా విజయ్ ముందుకు వచ్చే వీలుంది.
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే!
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎన్నికల తదనంతర పరిణామాలు, సంకీర్ణ సమీకరణాలు క్షణాల్లో నాయకులను పీఠమెక్కిస్తాయి. లోక్‌సభలో సంఖ్యాబలం సాధించడంలో కాంగ్రెస్ ఇబ్బంది పడి, ఇతర మిత్రపక్షాలు రాహుల్ పేరును తిరస్కరిస్తే.. ప్రత్యామ్నాయంగా విజయ్ లాంటి కొత్త తరం నాయకుడు ఢిల్లీ పీఠాన్ని ఆశీనుడు కావడం అసాధ్యమేమీ కాదు. ఏది ఏమైనా, రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల మలుపులు విజయ్ పాత్రను ఎంతవరకు తీసుకెళ్తాయో చూడటం రసవత్తరంగా మారనుంది.

