తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ క్షేత్రస్థాయిలో తీవ్ర పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది.
సొంతిల్లు లేని నిరుపేదలకు 5 లక్షల ఆర్థిక సాయం అందించే ఈ స్కీమ్‌పై పల్లెల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రతి గ్రామానికి కేటాయించిన ఇళ్ల కోటా చాలా తక్కువగా ఉండటం, దరఖాస్తు చేసుకున్న ఆశావహుల సంఖ్య వేలల్లో ఉండటంతో.. ఎవరిని ఎంపిక చేయాలో తెలియక స్థానిక కాంగ్రెస్ నాయకులు, అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కోటా పంచాయతీ కాస్తా ఇప్పుడు అధికార పార్టీలోనే అంతర్గత గ్రూపు తగాదాలకు దారితీసింది.
అధికార పార్టీలోనే 'నా మనుషులు.. నీ మనుషులు' వార్!
ఖమ్మం, నల్గొండ, వరంగల్ వంటి జిల్లాల పల్లెల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ స్థాయి ప్రెసిడెంట్లు, మండల లీడర్ల మధ్య తీవ్ర విభేదాలు భగ్గుమంటున్నాయి. నియోజకవర్గ ఇన్-చార్జ్ , ఎమ్మెల్యే అనుచరులు ఒక లిస్టు ఇస్తుంటే.. దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన పాత కాపులు మరో లిస్టు పట్టుకుని వస్తున్నారు. మా వార్డులో మా వాళ్లకే ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ లోకల్ లీడర్లు పట్టుబడుతుండటంతో గొడవలు అవుతున్నాయి. మొదటి విడత సమయంలో అలాగే జరిగింది. ఇప్పుడు రెండో విడత సమయంలోనూ అలాగే జరుగుతోంది. కోటా పరిమితంగా ఉండటంతో సొంత పార్టీ కార్యకర్తలనే సంతృప్తి పరచలేక, వారి అసంతృప్తిని తట్టుకోలేక అధికార పార్టీ నేతలకు ఇందిరమ్మ ఇళ్లు పెద్ద తలనొప్పిగా మారాయి.
అర్హులను వదిలేశారంటూ.. లిస్టులతో బీఆర్ఎస్ కౌంటర్!
ఇదే రాజకీయాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ నేతలు తమకు నచ్చిన కార్యకర్తలకు, ఇళ్లు ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లను కట్టబెడుతున్నారంటూ గులాబీ క్యాడర్ గ్రామాల్లో రచ్చకెక్కిస్తోంది. నిజమైన అర్హులు, గుడిసెల్లో నివసించే నిరుపేదల వివరాలను సేకరించి.. వారికి కాంగ్రెస్ మార్కు ఎంపికలో ఎలా అన్యాయం జరిగిందో చూపిస్తూ సోషల్ మీడియాలో, కలెక్టరేట్ల ముందు నిరసనలకు దిగుతున్నారు. అధికారికంగా విడుదలవుతున్న లబ్ధిదారుల తాత్కాలిక జాబితాలను పట్టుకుని, గ్రామ సభల్లో అధికారులను, కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ లోకల్ లీడర్లు నిలదీస్తుండటంతో పల్లెల్లో వాతావరణం ఉద్రిక్తంగా మారుతోంది.
అధికారులపై పొలిటికల్ ప్రెజర్.. మధ్యలో సామాన్యుల తిప్పలు
ఈ పొలిటికల్ వార్ మధ్యలో పడి మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు నలిగిపోతున్నారు. లీడర్లు ఇచ్చిన లిస్టు ప్రకారం సర్వేలు చేయాలా? లేక ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులను తేల్చాలా? అనే గందరగోళంలో పడ్డారు. పొలిటికల్ రికమండేషన్లు ఉంటేనే ఇందిరమ్మ ఇళ్లు వస్తాయనే ప్రచారం ఊపందుకోవడంతో.. ఎలాంటి రాజకీయ అండదండలు లేని నిరుపేద సామాన్యులు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ దరఖాస్తుల స్టేటస్ చెక్ చేసుకుంటున్నారు. పార్టీ నేతల ఐక్యత పై ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, తెలంగాణ జిల్లాల్లో ఈ 'బెంచ్‌మార్క్ లొల్లి' రోజురోజుకూ మరింత ముదురుతోంది.

