Dailyhunt
కాంగ్రెస్ పదవుల జాబితాలొచ్చేశాయ్!

కాంగ్రెస్ పదవుల జాబితాలొచ్చేశాయ్!

Telugu 360 1 week ago

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎంతో కాలంగా ఆశావహులు ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమయింది.

పార్టీ కోసం కష్టపడిన కీలక నేతలకు, సీనియర్లకు సముచిత స్థానం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల నియామకాలను చేపట్టిం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుమారు 17 కార్పొరేషన్లు , ఏజెన్సీలకు పదవులను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.

ఈ నియామకాల్లో సామాజిక సమతుల్యతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్‌గా శ్రీనివాస్, రజక సహకార కార్పొరేషన్ చైర్మన్‌గా అజయ్ కుమార్, గౌడ సహకార కార్పొరేషన్ చైర్మన్‌గా మోటుకూరి చంద్రశేఖర్ గౌడ్ నియమితులయ్యారు. అదేవిధంగా మున్నూరు కాపు కార్పొరేషన్‌కు బొమ్మ శ్రీరామ్, యాదవ కార్పొరేషన్‌కు రఘునాథ్ యాదవ్, కమ్మ కార్పొరేషన్‌కు బండి రమేష్‌లను చైర్మన్లుగా ఎంపిక చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది .

మరికొన్ని కీలక విభాగాల్లో.. పద్మశాలి సహకార కార్పొరేషన్ చైర్మన్‌గా గుడుగు శ్రీనివాస్, గొర్రెలు , మేకల అభివృద్ధి సంస్థకు కొల్లె సరిత, తెలుగు అకాడమీ చైర్మన్‌గా ప్రొఫెసర్ వెంకట నారాయణలను నియమించారు . వీటన్నింటితో పాటు, గ్రామ పంచాయతీలకు సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్‌ను కూడా ఏర్పాటు చేస్తూ, దానికి రామిరెడ్డిని చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా ప్రభుత్వం ఈ పదవులను భర్తీ చేసింది. ఈ పదవుల్లో నియమితులైన వారు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరికొన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360