తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రగడ మొదలైంది. ఇప్పుడే అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న తమిళగ వెట్రి కజగం అధినేత, ముఖ్యమంత్రి విజయ్‌ను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రధాని అభ్యర్థి గా ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తుండటమే దీనికి కారణం.
ఉత్తరాది రాష్ట్రాల్లోనూ విజయ్‌కు ఆదరణ ఉందని, భవిష్యత్తులో దేశాన్ని ఏలే సత్తా ఆయనకే ఉందంటూ టీవీకే మంత్రులు, సీనియర్ నాయకులు నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. పొత్తులో భాగస్వామిగా ఉన్న తమిళనాడు కాంగ్రెస్ నేతలకు ఈ ధోరణి తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.
ఫ్యాన్ క్లబ్ మనస్తత్వం అంటూ సెటైర్లు
ఆలూ లేదు.. చూలూ లేదు అన్నట్లుగా 2029 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రధాని అభ్యర్థిత్వంపై రెండు పార్టీలూ ఇప్పుడే బహిరంగంగా ఘర్షణ పడడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. టీవీకే నేతలు ఇంకా రాజకీయ పరిపక్వత లేకుండా, కేవలం ఫ్యాన్ క్లబ్ మనస్తత్వం తో ప్రవర్తిస్తున్నారంటూ తమిళనాడు కాంగ్రెస్ కమిటీ నేతలు మండిపడుతున్నారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి, కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ మాత్రమే ఏకైక ప్రధాని అభ్యర్థి అని, అందులో ఎలాంటి సందేహమూ లేదని స్పష్టం చేస్తున్నారు.
షాకిస్తామంటున్న కాంగ్రెస్
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఘాటు సంకేతాలు వెలువడుతున్నాయి. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించకుండా, తమ సొంత నేత విజయ్‌ను ప్రధానిగా రుద్దాలని చూస్తే పొత్తును పునరాలోచించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. టీవీకే ప్రభుత్వం ఏర్పడటానికి కాంగ్రెస్ ఇచ్చిన మద్దతే మూల కారణమని గుర్తుచేస్తున్న నేతలు.. రాహుల్‌ను కాదని విజయ్ ప్రధాని రేసులో ఉంటానంటే, తమిళనాడు మంత్రివర్గం నుండి తప్పుకోవడానికి , ప్రభుత్వానికి గుడ్ బై చెప్పడానికి కూడా వెనుకాడబోమని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఆశలకు హద్దు ఉండాలంటున్న డీఎంకే
మరోవైపు ఈ అంతర్గత వివాదాన్ని ప్రతిపక్ష డిఎంకె తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తోంది. ఊహలకు హద్దులు లేకుండా విజయ్‌ను ప్రధానిని చేస్తామంటూ టీవీకే కంటున్న కలలు హాస్యాస్పదమని వ్యాఖ్యానిస్తోంది. పొత్తు పెట్టుకుని రాహుల్ గాంధీని ప్రధానిగా అంగీకరించని స్థితిలో కాంగ్రెస్ ఆత్మగౌరవం ఎక్కడికి పోయిందని డిఎంకె ప్రశ్నిస్తోంది. మొత్తానికి, తమిళనాడు స్థానిక సమీకరణాల కోసం కలిసిన కాంగ్రెస్-టీవీకే బంధం, ప్రధాని అభ్యర్థిత్వం చుట్టూ తిరుగుతున్న వివాదంతో రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందోనని ఆసక్తి నెలకొంది.

