వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో కొత్తగా వెలిసిన కార్పొరేట్ సెలూన్లను నెల రోజుల్లో ఖాళీ చేయాలని, లేకుంటే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నాలు చేసి మూసివేయిస్తామంటూ వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
భారత రాజ్యాంగం దేశంలోని ఏ ప్రాంతంలోనైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునే హక్కును ప్రతి పౌరుడికీ, సంస్థకూ కల్పిస్తోంది. అటువంటిది ప్రజాక్షేత్రంలో బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న నాయకులు బహిరంగంగానే ఇలాంటి అల్టిమేటం లు ఇవ్వడం వ్యాపార వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
కొత్తవేం కాదే!
కార్పొరేట్ లేదా బ్రాండెడ్ సెలూన్లు అనేవి నిన్నగాక మొన్న పుట్టుకొచ్చినవి కావు. దశాబ్దాలుగా నగరాలు, పట్టణాల్లో ఆధునిక జీవనశైలికి అనుగుణంగా సర్వీస్ సెక్టార్ విస్తరిస్తోంది. అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే.. కార్పొరేట్ బ్రాండ్లకు, సంప్రదాయ సెలూన్లకు మధ్య సేవల తీరు, ధరల వ్యత్యాసం చాలా స్పష్టంగా ఉంటుంది. ఎవరి కస్టమర్ బేస్ వారికి వేరుగా ఉంటుంది. పైగా, కార్పొరేట్ సెలూన్లలో పనిచేసే బ్యూటీషియన్లు, హెయిర్ స్టైలిస్టులు, ఇతర సహాయక సిబ్బంది కూడా సామాన్య వర్గాల నుంచే వస్తారు. అక్కడ ఉద్యోగాలు చేయడం ద్వారా అనేక కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి.
మమూళ్లు ఇవ్వలేదనే బెదిరింపులా?
ఇలాంటి వివాదాల వెనుక సాధారణంగా వినిపించే ఆరోపణలు.. మామూళ్ల డిమాండ్లు లేదా రాజకీయ మైలేజ్. గతంలోనూ వ్యాపార వర్గాల నుంచి వసూళ్లకు పాల్పడటం, అవి అందకపోతే ఇలాంటి కృత్రిమ ఉద్యమాలను తెరపైకి తెచ్చి వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేయడం కొన్ని రాజకీయ వర్గాలకు అలవాటుగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. సాధారణ స్థానిక వృత్తిదారుల జీవనోపాధిని నిజంగా రక్షించాలనుకుంటే వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం, అధునాతన శిక్షణ ఇప్పించడం, రుణ సదుపాయాలు కల్పించడం వంటి నిర్మాణాత్మక మార్గాలుంటాయి. కానీ, నూతన పెట్టుబడులను తరిమివేస్తామని బెదిరించడం కేవలం స్వప్రయోజనాలకు, అలజడి సృష్టించే రాజకీయాలకు తప్ప దేనికీ పనికిరాదు.
రేపు డిమార్ట్‌లపైనా దాడి చేయరని గ్యారంటీ ఏముంది?
ఇవాళ సెలూన్లపై పడుతున్నారు..రేపు చిల్లర దుకాణాలను నిర్వర్యం చేస్తున్నాయని డిమార్ట్ వంటి వాటిపైనా పడరని గ్యారంటీ ఏముంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నూతన పెట్టుబడులను ఆహ్వానిస్తూ, వ్యాపార అనుకూల వాతావరణాన్ని నిర్మించేందుకు కృషి జరుగుతున్న సమయంలో.. క్షేత్రస్థాయిలో ఇలాంటి బెదిరింపులు చోటుచేసుకోవడం రాష్ట్ర ప్రతిష్టకు విఘాతం కలిగిస్తుంది. వ్యాపారాలను భయపెట్టి పారదోలాలని చూసే ఇలాంటి ధోరణులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోకపోతే, స్థానికంగా ఉపాధి అవకాశాలు దెబ్బతినడమే కాకుండా చిరువ్యాపారుల నుండి కార్పొరేట్ సంస్థల వరకు ఎవరూ ధైర్యంగా ముందుకు రాలేని దుస్థితి ఏర్పడుతుంది.

