ఆంధ్రప్రదేశ్ ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్కడికి వెళ్లినా తనదైన ప్రత్యేక శైలిని ప్రదర్శిస్తుంటారు. నిత్యం పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ పెట్టుబడులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అంటూ గడిపే ఈ యువ మంత్రి..
తాజాగా వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో వాటితో పాటు పొలం బాట పట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామంలోని ఒక ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన సందర్శించారు.
కడప పర్యటనలో సాధారణంగా పార్టీ అంతర్గత సమావేశాలు జరిగాయి. సోలార్ పరిశ్రమనూ ప్రారంభించారు. వాటి హడావుడి మధ్యలోనే లోకేష్ మాత్రం ప్రొటోకాల్ ని పక్కనబెట్టి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు మునగాల ద్వారకానాథ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో ఎంతో ఆప్యాయంగా గడిపారు. సాగు పద్ధతులు, సేంద్రీయ ఎరువుల వాడకం, ప్రకృతి వ్యవసాయం ద్వారా వస్తున్న దిగుబడుల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పచ్చని పంట పొలాల్లో కలియదిరుగుతూ ఆయన చూపిన ఉత్సాహం, రైతుల పట్ల ఆయనకున్న గౌరవాన్ని, వ్యవసాయ రంగంపై ఉన్న మక్కువను చాటిచెప్పింది.
రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా, భూమిని నమ్ముకున్న అన్నదాతను కూడా అంతే గౌరవించాలనే తపన లోకేష్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. పారిశ్రామికీకరణ ఎంత ముఖ్యమో, పర్యావరణాన్ని రక్షించే ప్రకృతి వ్యవసాయం కూడా అంతే అవసరమనే సందేశాన్ని ఆయన తన పర్యటన ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు.
నారా లోకేష్ కడప టూర్ అటు హైటెక్ పరిశ్రమల స్థాపన, ఇటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలమైన వ్యవసాయం.. ఈ రెండింటికీ సమ ప్రాధాన్యత ఇస్తూ ఆయన సాగిస్తున్న ప్రయాణం ప్రశంసనీయం. ఒకవైపు సరికొత్త పారిశ్రామిక విధానాలతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూనే, ఇలా మట్టి మనుషులతో మమేకమవ్వడం లోకేష్ ప్రత్యేకమైన స్టైల్ . ఎక్కడికి వెళ్లినా ఏదో ఓ విషయం నేర్చుకుని దాన్ని ఏపీ కోసం అన్వయించడాన్ని ఎప్పుడూ మర్చిపోరు.

