రాయలసీమ ప్రాంతంలో ఐటీ, సాంకేతిక రంగాల ముఖచిత్రాన్ని మార్చేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కడప స్టార్టప్ హబ్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి.
ఇప్పటివరకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకే పరిమితమైన స్టార్టప్ సంస్కృతిని రాయలసీమ యువతకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇది రూపుదిద్దుకుంది. స్థానిక నిరుద్యోగ యువత ఉన్నత చదువుల అనంతరం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే అవసరం లేకుండా, ఇక్కడే కొత్త ఆవిష్కరణలు, వ్యాపారాలు ప్రారంభించేందుకు ఇది అద్భుత వేదికగా నిలవనుంది. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో సిద్ధమైన ఈ భవనాన్ని త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించేందుకు కడప జిల్లా యంత్రాంగం వేగంగా సన్నాహాలు చేస్తోంది.
ఎవరి ఐడియా? ఆశయం ఏంటి?
ఉద్యోగాల కోసం ఆశించే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి.. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి" అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టికి అనుగుణంగా జిల్లా పాలనా యంత్రాంగం ఈ ప్రాజెక్టును ఆకృతి చేసింది. స్టార్టప్ కడప పేరుతో పిలిచే ఈ ప్రతిష్టాత్మక హబ్‌ను P4 మోడల్‌లో రూపొందించారు. ఐఐటీలు, ఐఐఎంల నిపుణులు, గ్లోబల్ టెక్ కంపెనీల అధిపతులతో విద్యార్థులు , ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మెంటార్‌షిప్ ఇచ్చేలా దీనికి శ్రీకారం చుట్టారు.
ఎవరు నిర్మించారు? ఎంత ఖర్చు?
ఈ స్టార్టప్ హబ్ నిర్మాణాన్ని కడప జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో శరవేగంగా పూర్తి చేశారు. మొత్తం రూ. 12 కోట్ల అంచనా వ్యయంతో 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+3 ఆకృతిలో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నీతి ఆయోగ్ రూ. 3 కోట్లు మంజూరు చేయగా, ప్రముఖ మౌలిక వసతుల సంస్థ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ తమ CSR నిధుల కింద రూ. 4 కోట్లు ఆర్థిక సహాయం అందించింది. మిగిలిన నిధులను జిల్లా యంత్రాంగం సేకరించి నిర్మాణాన్ని పూర్తి చేసింది.
ప్రత్యేకతలు , వసతులు
ఈ భవనంలో ఒకేసారి 400 మందికి పైగా పనిచేసుకునేలా ప్లగ్ అండ్ ప్లే వర్కింగ్ స్పేస్ వసతిని కల్పించారు. సరికొత్త బిజినెస్ ఐడియాతో వచ్చే యువతకు హై-స్పీడ్ ఇంటర్నెట్, ప్రొటోటైపింగ్ ల్యాబ్‌లు, లీగల్, ఫైనాన్షియల్ సలహాలతో పాటు ఫండింగ్ సమకూర్చే గ్లోబల్ వెంచర్ క్యాపిటలిస్టులను కూడా ఇక్కడికి అనుసంధానించనున్నారు. కడపను ఐటీ, ఆవిష్కరణల నిలయంగా మార్చే దిశగా ఈ భవన ప్రారంభోత్సవం సరికొత్త మైలురాయిగా నిలవనుందని స్థానిక పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
జగన్ ఎప్పుడూ కడపకు ఐటీ గురించి ఆలోచించలేదు.. ఫిష్ మార్టుల గురించి మాత్రమే గొప్పగా చెప్పేవారు. అందుకే కనీసం క్రెడిట్ తీసుకునేందుకు ఒక్క శాతం కూడా చాయిస్ లేకుండా పోయింది.

