కర్నూలు జిల్లా రాజకీయంలో ముఖ్యంగా వైసీపీలో బైరెడ్డి తప్ప ఎవరూ లేరన్నట్లుగా రాజకీయం మారింది. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ను టార్గెట్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు.
కర్నూలు సిటీ నియోజకవర్గ రాజకీయాలపై కన్నేసిన బైరెడ్డి అక్కడ ఇతర వైసీపీ నేతల్ని తొక్కేసి తాను ముందుకు రావాలని చూస్తున్నారు.
రూ.45 కోట్ల లంచం ఆరోపణ.. కలెక్టరేట్ ధర్నాతో మొదలైన రచ్చ!
కర్నూలు కలెక్టరేట్ వద్ద వైసీపీ నిర్వహించిన నిరసన ప్రదర్శనలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి ప్రధాన కారణమయ్యాయి. ఓ ప్రముఖ ఫార్మా కంపెనీ నుంచి మంత్రి టీజీ భరత్ ఏకంగా రూ.45 కోట్లు లంచ * తీసుకున్నారంటూ బైరెడ్డి బహిరంగంగా ఆరోపణలు గుప్పించారు. కేవలం రాజకీయ మైలేజ్ కోసమే కాకుండా, కర్నూలు సిటీ పరిధిలో ఉన్న విపక్ష నేతలను, తన క్యాడర్‌ను ఏకం చేసేందుకు బైరెడ్డి ఈ లీడ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలు ఒక్కసారిగా జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి.
పోలీసులకు ఫిర్యాదు చేసిన మంత్రి
బైరెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి టీజీ భరత్ అత్యంత తీవ్రంగా స్పందించారు. తనపై, తన కుటుంబ సభ్యులపై ఎటువంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అవమానకరంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. ఈ మేరకు కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై మంత్రి క్రిమినల్ పరువు నష్టం దావా , పోలీసు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు బైరెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. త్వరలోనే సివిల్ పరువు నష్టం కేసు కూడా వేస్తానని, కోర్టులో బైరెడ్డి ఈ ఆరోపణలను ఎలా నిరూపిస్తారో చూస్తానని మంత్రి సవాల్ విసిరారు.
కర్నూలు నేతల అసంతృప్తి
బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నంద్యాల జిల్లాకు చెందిన నేత అయినప్పటికీ, కర్నూలు సిటీ పాలిటిక్స్‌లో జోక్యం చేసుకోవడం ఇప్పుడు సొంత పార్టీ అయిన వైసీపీలోనే అంతర్గత చిచ్చుకు దారితీసేలా కనిపిస్తోంది. కర్నూలు నగర పరిధిలో ఇప్పటికే వైసీపీ తరఫున పోటీ చేయడానికి పలువురు సీనియర్ నేతలు లైన్‌లో ఉన్నారు. ఇప్పుడు బైరెడ్డి హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చి మంత్రిని నేరుగా టార్గెట్ చేయడం ద్వారా ఇక్కడి స్థానిక నేతలకు చెక్ పెట్టాలని చూస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఒకవైపు సొంత సోదరి, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి నుంచి కౌంటర్లు ఎదుర్కొంటున్న సిద్ధార్థ్ రెడ్డి.. ఇప్పుడు కర్నూలు రాజకీయాల్లో వేలు పెట్టడం వైసీపీలో గ్రూపు తగాదాలను మరింత పెద్దది చేయనున్నాయి. సజ్జల వంటి వారి సలహాలతోనే ఆయన కర్నూలులో రాజకీయం చేస్తున్నట్లుగా ఇతర నేతలు అనుమానిస్తున్నారు.

