ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఆయన అత్యంత నమ్మకస్తుడైన పర్సనల్ అసిస్టెంట్ కే. నాగేశ్వరరెడ్డి వందల కోట్లు అక్రమంగా సంపాదించినట్లుగా తేలిపోయింది.
ఆస్తులన్నీ బయటపడ్డాయి. దర్యాప్తు సంస్థల నుంచి సెగ తగులుతున్న తరుణంలో, కేఎన్‌ఆర్‌ను తన నుంచి వేరు చేసి చూపించేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలు సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారాయి
పీఏ ముసుగు మార్చే ప్రయత్నం
దశాబ్ద కాలంగా జగన్ వెంటే ఉండి, ఆయన అపాయింట్‌మెంట్లను శాసిస్తూ, క్షేత్రస్థాయిలో సెటిల్మెంట్లు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేఎన్‌ఆర్‌ను ఇప్పుడు వైసీపీ దూరం పెట్టడం విస్మయానికి గురిచేస్తోంది. స్వయంగా సాక్షి మీడియాలో కేఎన్‌ఆర్ ఎప్పుడూ జగన్‌కు పర్సనల్ అసిస్టెంట్ కాదని, ఆయన కేవలం ఒక పొలిటికల్ అసిస్టెంట్ మాత్రమేనని ప్రచారం చేయడం ద్వారా జగన్ తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనెవరో మాకు తెలియదు.. పార్టీలో ఒక చిన్న కార్యకర్త అన్నట్లుగా చిత్రీకరించడం ద్వారా, భవిష్యత్తులో వచ్చే చట్టపరమైన చిక్కుల నుండి తప్పించుకోవాలనేది జగన్ మాస్టర్ ప్లాన్‌గా కనిపిస్తోంది.
ప్రజలు పిచ్చోళ్లు కాదు
జగన్ రెడ్డి తన అవసరాల కోసం వ్యక్తులను వాడుకుని, ఇబ్బందులు ఎదురైనప్పుడు వారిని నడిసముద్రంలో వదిలేస్తారనే ముద్ర గతంలోనే ఉంది. ఇప్పుడు కేఎన్‌ఆర్ విషయంలోనూ అదే పునరావృతమవుతోందని అభిప్రాయపడుతున్నారు. ఐదేళ్ల పాటు సీఎంతో గడిపి, పార్టీలో అత్యంత కీలక చక్రం తిప్పిన వ్యక్తిని ఇప్పుడు ఎవరో తెలియదు అనడం హాస్యాస్పదంగా ఉంది. ఈ కట్-ఆఫ్ స్ట్రాటజీని గమనిస్తున్న తటస్థ ప్రజలు సైతం, జగన్ తన బినామీ ఆస్తులు బయటపడకుండా ఉండేందుకే తన నీడను కూడా వదులుకుంటున్నారని అనుకుంటున్నారు.
కేఎన్‌ఆర్ అప్రూవర్ గా మారితే..
జగన్ చేస్తున్న ఈ ప్రయత్నాలు కేఎన్‌ఆర్‌ను తీవ్ర అసహనానికి గురిచేస్తున్నట్లు సమాచారం. తనను బినామీగా పెట్టుకుని, వందల కోట్ల దందాలు చేయించి, ఇప్పుడు అసలు తనతో సంబంధం లేదని బుకాయిస్తుంటే కేఎన్‌ఆర్ మౌనంగా ఉంటారా అన్నది ప్రశ్నార్థకం. దర్యాప్తు సంస్థల ఒత్తిడి పెరిగితే, బలిపశువు కావడానికి బదులు అప్రూవర్ గా మారి అసలు విషయాలన్నీ బయటపెట్టే అవకాశం ఉంది. ఒకవేళ కేఎన్‌ఆర్ నోరు విప్పితే, అది జగన్ రెడ్డి రాజకీయ జాతకాన్నే తిరగరాస్తుందని, బినామీ సామ్రాజ్యం మొత్తం కుప్పకూలుతుందని అనుకోవచ్చు.
బలి చేసేస్తారా?
ఇప్పటికే అక్రమాస్తుల కేసుల్లో దశాబ్ద కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న జగన్‌కు, ఈ లిక్కర్-కేఎన్ఆర్' ఇష్యూ ఒక పెను ముప్పుగా మారింది. తనను తాను రక్షించుకోవడానికి కేఎన్‌ఆర్‌ను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్న జగన్, నిజానికి పులి మీదే సవారీ చేస్తున్నారు. పీఏగా ఉన్న వ్యక్తి తన ప్రాణాలకు లేదా ఆస్తులకు ముప్పు ఉందని భావించి తిరగబడితే, దర్యాప్తు సంస్థలకు జగన్ అవినీతి చిట్టా మొత్తం అందిస్తారు. కేఎన్‌ఆర్ ఇచ్చే ఒక్క వాంగ్మూలం జగన్‌ను చిక్కుల్లోకి నెట్టడానికి సరిపోతుంది. రాజకీయాల్లో విశ్వసనీయత చాలా ముఖ్యం. నమ్మిన వారిని జగన్ వదిలేస్తున్నారనే సంకేతం కేడర్‌లోకి వెళ్తే, అది పార్టీ మనుగడకే ప్రమాదం. కేఎన్‌ఆర్‌ను డిస్ ఓన్ చేసుకోవడం ద్వారా జగన్ సేఫ్ అవుతారా లేక పీఏనే రివర్స్ అటాక్ చేస్తారా అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.

