సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందంజలో ఉండే కేరళ రాష్ట్రం, దేశంలోనే సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే, దేశంలోనే మొట్టమొదటిసారిగా క్యాబినెట్ స్థాయిలో ప్రత్యేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
అయితే ఈ శాఖకు టెక్నాలజీపై పట్టున్న యువకుడ్ని నియమించాల్సింది పోయి.. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కు చెందిన 74 ఏళ్ల సీనియర్ నాయకుడికి కేటాయించారు.
ఈ నూతన ఏఐ మంత్రిత్వ శాఖ కేవలం ఒక సాంకేతిక విభాగంగా కాకుండా.. రోజువారీ పాలనను పూర్తిగా డిజిటలైజ్ చేసి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేలా పనిచేస్తుంది. కేరళ ఏఐ మిషన్ ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో కృత్రిమ మేధస్సును అనుసంధానించనున్నారు. ఉదాహరణకు.. భూగర్భ వనరుల నిర్వహణలో ప్రిడిక్టివ్ అనలిటిక్స్, విపత్తుల ముందస్తు హెచ్చరికలు, వైద్యరంగంలో రోగాల గుర్తింపు, వ్యవసాయంలో రైతులకు మేలైన సలహాలు అందించడం, కే-స్మార్ట్ ప్లాట్‌ఫామ్ ద్వారా స్థానిక పరిపాలనలో సర్టిఫికెట్ల జారీ, పన్నుల చెల్లింపులను పూర్తిగా ఏఐ ఆధారితంగా మార్చడం ఈ శాఖ ముఖ్య ఉద్దేశం.
తమిళనాడులో నూతనంగా ఏర్పడిన సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం ప్రభుత్వం, తాము అధికారంలోకి వస్తే ప్రత్యేకంగా ఏఐ మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేస్తామని గతంలోనే ప్రకటించింది. అయితే, తమిళనాడు ఆ దిశగా అడుగులు వేసేలోపే, కేరళలో కాంగ్రెస్-యూడీఎఫ్ కూటమి ప్రభుత్వం అత్యంత వేగంగా ఈ నిర్ణయాన్ని అమలు చేసి దేశంలోనే ఫస్ట్ నిలిచింది.

