రాజకీయాల్లో శత్రుత్వం మాత్రమే ఉంటుంది తప్ప మిత్రుత్వం ఉండదనేలా మారిపోతున్న పరిస్థితులకు భిన్నంగా, పొరుగు రాష్ట్రమైన కేరళలో ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టే ఒక అరుదైన, అత్యంత హుందా అయిన ఘట్టం ఆవిష్కృతమైంది.
కేరళ నూతన ముఖ్యమంత్రిగా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూటమి నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీడీ సతీశన్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకకు మాజీ సీఎం విజయ్ సహా.. బీజేపీ కేరళ ముఖ్యనేతలూ హాజరయ్యారు.
ఎన్నికల వేళ ఇరు పక్షాల మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు నడిచినప్పటికీ.. ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రత్యర్థి అధికార పీఠాన్ని అధిరోహించే వేడుకకు విజయన్ రావడం, వేదికపై నూతన సీఎం వీడీ సతీశన్ పక్కనే ఆసీనులు కావడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఓడిపోయిన వెంటనే అధికార మార్పిడిని ఇంత హుందాగా స్వీకరించడం కేరళ రాజకీయ సంస్కృతికి అద్దం పడుతోంది. భారతీయ జనతా పార్టీని కేరళలో అన్నీ తానే నడిపిస్తున్న రాజీవ్ చంద్రశేఖర్‌తో పాటు వివిధ పార్టీల అగ్రనేతలు, సామాజిక, సాంస్కృతిక రంగాల ప్రముఖులు ఈ ప్రమాణ స్వీకారానికి తరలివచ్చారు. రాజకీయ సిద్ధాంతాలు, విభేదాలు ఏవైనా.. ప్రజాస్వామ్య స్ఫూర్తి విషయానికి వచ్చేసరికి నాయకులంతా ఒకే వేదికను పంచుకోవడం కేరళ పొలిటికల్ మెచ్యూరిటీని చాటిచెప్పింది. వేదికపై నేతలందరూ పరస్పరం ఆత్మీయంగా పలకరించుకోవడం అక్కడి వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చింది.
ఈ విషయం దేశం మొత్తం హాట్ టాపిక్ అవుతోంది కానీ కేరళలో మాత్రం ఇలాంటి రాజకీయ వాతావరణం ఎప్పటి నుంచో ఉంది. నడమంత్రపు నేతలు అధికారంతో ప్రత్యర్థుల్ని వేధించేసి తాము శాశ్వతం అనుకునే పరిస్థితులు అక్కడ లేవు. అలాంటి వారు ఎవరూ రాలేదు. రాజకీయాలను రాజకీయాలుగానే చూస్తారు. ఎవర్నీ ఎవరూ శత్రువులుగా చూసుకోరు. అందుకే కేరళ రాజకీయం కేరళ వాతావరణలాగే ఆహ్లాదంగా ఉంటుంది.

