Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేసీఆర్ మార్క్ హామీలే..కవిత నమ్మించగలరా?

కేసీఆర్ మార్క్ హామీలే..కవిత నమ్మించగలరా?

Telugu 360 59 mins ago

తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న కల్వకుంట్ల కవిత ప్రకటిస్తున్న సరికొత్త రాజకీయ కార్యాచరణ, ప్రజల్లో కొత్తదనాన్ని నింపకపోగా పాత కేసీఆర్ ఫార్ములానే తలపిస్తోంది.

తెలంగాణ రక్షణ సేన వేదికగా ఆమె తెరపైకి తెస్తున్న ఎజెండా, విమర్శల శైలి, సంక్షేమ పథకాల ప్రకటనలు అన్నీ గులాబీ దళపతి కేసీఆర్ అనుసరించిన పాత రాజకీయ నమూనాను కాపీ కొట్టినట్లుగానే కనిపిస్తున్నాయి. తాజాగా ఆమె ప్రకటించిన హామీలు, కార్యాచరణ ప్రజల్లోకి వెళ్లినా.. అది ఒకప్పుడు చూసి అలవాటుపడిన విన్యాసాలాగే కనిపిస్తోంది తప్ప ఓటర్లను సరికొత్తగా ఆకట్టుకునేలా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తాము అధికారంలోకి వస్తే భూ లక్ష్మి పథకం కింద భూమి లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఎకరం చొప్పున భూమి ఇస్తామంటూ కవిత సంచలన ప్రకటన చేశారు. అయితే గతంలో 2014 ఎన్నికల ముందు కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని ప్రకటించి, ఆ తర్వాత అమలు చేయలేక చేతులెత్తేసిన చేదు అనుభవం ప్రజల మదిలో ఇంకా సజీవంగానే ఉంది. ఇప్పుడు కవిత అదే తరహాలో ఎకరం భూమి ఇస్తామనడం పాత సీసాల్లో కొత్త సారా పోసినట్లుగా ఉందని, నేటి భూముల ధరలు, భూ సేకరణ సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుంటే ఇలాంటి పాతకాలపు ఉచిత హామీలు ప్రజలను అంత సులభంగా ఆకర్షించడం కష్టమేనని భావిస్తున్నారు.

ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ నాయకుడైనా అధికారంలోకి రావడానికి హామీలు, వాగ్దానాలు గుప్పించడం సహజమే. అయితే, కేవలం హామీలు ప్రకటించడమే ముఖ్యం కాదు. తాము చెప్పే విధానం ఆచరణ సాధ్యమేనని, తాము ఇతరుల కంటే భిన్నమైన నాయకులమని ప్రజలకు బలంగా నమ్మించడంలోనే అసలైన రాజకీయ ప్రతిభ దాగి ఉంటుంది. భూదాన్, ప్రభుత్వ లేదా బినామీ భూములను సేకరించి పంచుతామని చెప్పినప్పటికీ, గత వైఫల్యాల నీడను దాటి ప్రజల్లో ఆ విశ్వసనీయతను కల్పించకపోతే అవి కేవలం ఎన్నికల స్టంట్లుగానే మిగిలిపోతాయి.

తెలంగాణ సమాజంలో రాణించాలంటే గత బీఆర్ఎస్ వైఫల్యాల తాలూకు ఫార్ములాను రీసైకిల్ చేయడం కంటే, సమకాలీన సమస్యలపై సరికొత్త ఆలోచనలు చూపించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ అడుగుజాడల్లో కేవలం భారీ ప్రకటనలు చేసి చేతులు దులుపుకుంటే కాకుండా, ప్రతిపాదిత ప్రణాళికలను క్షేత్రస్థాయిలో ప్రజలు నమ్మేలా ఒక బలమైన ఆల్టర్నేటివ్ లీడర్‌గా తనను తాను నిరూపించుకున్నప్పుడే కవిత రాజకీయంగా ఏమైనా ప్రభావం చూపగలరు. లేనిపక్షంలో, ఈ ప్రకటనలు కేవలం రాజకీయ ప్రెస్ మీట్లకు, సోషల్ మీడియా ట్రోల్స్‌కు మాత్రమే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360