తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్ లో బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా ఆ పార్టీ సీనియర్ నేత హరీశ్ రావును లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు.
హరీశ్ రావుకు పార్టీ పట్ల నిజంగానే నిబద్ధత ఉంటే.. కేసీఆర్ మీద ఒట్టేసి, తాను ఎప్పటికీ బీఆర్ఎస్‌లోనే ఉంటానని బహిరంగంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. హరీశ్ రావు గతంలోనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్న రోజుల్లో ఆయనతో టచ్‌లోకి వెళ్లారని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం ఆయన తెరవెనుక ఎవరెవరితో మాట్లాడుతున్నారో, ఏయే రాజకీయ బేరసారాలు సాగిస్తున్నారో తన వద్ద పూర్తి సమాచారం ఉందని, అయితే ఆ విషయాలను తాను ఇప్పుడే బయటపెట్టనని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు ఇటీవలి పర్యటనలపై సీఎం రేవంత్ రెడ్డి పలు అనుమానాలను వ్యక్తపరిచారు. బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఒక ముఖ్యమైన సమావేశాన్ని అర్ధాంతరంగా వదిలేసి, హరీశ్ రావు హఠాత్తుగా ఢిల్లీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటనలో ఆయన ఎవరిని కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హరీశ్ రావు రాజకీయ అడుగులపై సొంత పార్టీలోనే అనుమానాలు ఉన్నాయనే కోణంలో ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
రాబోయే రోజుల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేయబోతున్నాయంటూ రేవంత్ రెడ్డి పెద్ద బాంబు పేల్చారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయనడంలో తనకు ఎలాంటి అనుమానం లేదని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ లోపల, బయట ఆ రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహనను ప్రజలు గమనిస్తున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు తెరవెనుక ఒక్కటవుతున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్‌లో మాట్లాడిన ఈ అంశాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

