Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేసులన్నీ కదులుతున్నాయి  - కానీ  కింగ్‌పిన్‌కు నోటీసులు కూడా వెళ్లవా!?

కేసులన్నీ కదులుతున్నాయి - కానీ కింగ్‌పిన్‌కు నోటీసులు కూడా వెళ్లవా!?

Telugu 360 1 week ago

కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలు కీలక కేసుల్లో దూకుడు చూపిస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రమేయమున్న ఏకంగా ఐదు కీలక కేసుల్లో కేవలం ఒక్క రోజులోనే కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

దశాబ్దాల నాటి అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ కేసులతో పాటే ఈడీ కేసులను రోజువారీ ప్రాతిపదికన విచారించాలని ప్రత్యేక కోర్టు నిర్ణయించగా.. అటు ఓబుళాపురం గనుల కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. మరోవైపు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరుకావడం, వరుసగా రెండో రోజూ విచారణకు రావాలని ఆదేశాలు అందుకోవడం కలకలం రేపింది. దీనికితోడు తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కుంభకోణంలో డెయిరీ సంస్థల రూ.130 కోట్ల ఆస్తుల జప్తు, గత వైసీపీ ప్రభుత్వ మద్యం కుంభకోణంలో నాటి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవకు ఈడీ సమన్లు జారీ చేయడం ఒకే రోజు జరగడం చర్చకు దారితీసింది.

అన్నింటికి సూత్రధారి జగనే !

ఈ ఐదు కేసుల మూలాలను నిశితంగా పరిశీలిస్తే.. వీటన్నింటిలోనూ అంతిమ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు పొందిన అంతిమ లబ్ధిదారుగా నేరుగా జగన్ మోహన్ రెడ్డి పేరే ప్రధాన ఆరోపణల్లో వినిపిస్తోంది. అక్రమాస్తుల కేసుల్లో క్విడ్ ప్రో కో ద్వారా తన సంస్థల్లోకి వేల కోట్ల పెట్టుబడులు మళ్లించారనేది ప్రాథమిక అభియోగం కాగా.. మద్యం పాలసీలో వేల కోట్ల ముడుపుల మళ్లింపు జగన్ కనుసన్నల్లోనే సాగిందన్న ఆరోపణలున్నాయి. వివేకా హత్య కేసులో సాక్ష్యాధారాల ధ్వంసం, గూగుల్ టేకౌట్ లొకేషన్లు జగన్ ప్యాలెస్‌ వైపు వేలెత్తి చూపిస్తుండగా.. టీటీడీ పాలకమండలి నియామకాలు, కల్తీ నెయ్యి టెండర్లలోనూ పాలకుల అండదండలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. అధికారులు, ఎంపీలు, వ్యాపారులు కేవలం జగన్ ఆదేశాలను అమలు చేసిన పావులుగా మాత్రమే మిగిలారని విచారణ నివేదికలే స్పష్టం చేస్తున్నాయి.

కనీసం ఒక్క నోటీసు కూడా పంపడం లేదే !

ఇంతటి తీవ్రమైన నేరారోపణలు, వందలాది కోట్ల అవినీతి ఆధారాలు బయటపడుతున్నప్పటికీ.. అసలు సూత్రధారిగా భావిస్తున్న జగన్ మోహన్ రెడ్డిని కేంద్ర దర్యాప్తు సంస్థలు కనీసం విచారణకు కూడా ఎందుకు పిలవడం లేదన్నదే ఇప్పుడు సామాన్య ప్రజలను వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న. కేసులు నమోదు చేసి ఐఏఎస్‌లను జైళ్లకు పంపుతారు, ఎంపీలను గంటల తరబడి విచారిస్తారు, కాంట్రాక్టర్ల ఆస్తులను జప్తు చేస్తారు.. కానీ పాలసీలను నడిపించి, మొత్తం అధికార యంత్రాంగాన్ని శాసించిన ప్రధాన వ్యక్తి వద్దకు వచ్చేసరికి మాత్రం ఈడీ, సీబీఐల దూకుడు ఎందుకు మందగిస్తోంది? విచారణ సంస్థల చేతులు ఎక్కడో ఒక అదృశ్య రాజకీయ శక్తి వల్ల బందీ అవుతున్నాయా లేక జాతీయ స్థాయి రహస్య అవగాహనలే జగన్‌కు రక్షణ కవచాలుగా మారుతున్నాయా అన్న తీవ్ర అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయి.

ఏళ్లకేళ్లు గడుస్తున్నా నిందితుడు బిందాస్ !

జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలై పన్నెండేళ్లు గడిచినా ఇంకా డిశ్చార్జి పిటిషన్ల దశను దాటలేదు. వివేకా హత్య జరిగి ఆరేళ్లు కావస్తున్నా లార్జర్ కాన్‌స్పిరసీ ఎక్కడిదాకా వచ్చిందో తేలడం లేదు. మద్యం, కల్తీ నెయ్యి కుంభకోణాల్లో కిందిస్థాయి వ్యాపారులపై కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారే తప్ప, విధాన నిర్ణేతలపై విచారణ అడుగులు ముందుకు పడటం లేదు. రోజువారీ విచారణలంటూ ప్రత్యేక కోర్టులు నిర్ణయాలు తీసుకుంటున్నా, ఉన్నత న్యాయస్థానాల్లో స్టేలు, సాంకేతిక అడ్డంకులతో విచారణను నిరంతరం సాగదీస్తూ దశాబ్దాలు గడిపేసే న్యాయ లొసుగులు నిందితులకు వరంగా మారుతున్నాయి.

ఇప్పటికైనా కింగ్‌పిన్‌ను వెంటాడుతారా?

సూత్రధారులను పక్కనపెట్టి పాత్రధారులను మాత్రమే విచారిస్తూ పోతే ఈ మహా కుంభకోణాలు ఎప్పటికీ తేలే అవకాశం లేదు. నిందితులు ఎంతటి ఉన్నత స్థానాల్లో ఉన్నా, అంతిమ లబ్ధిదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ మోహన్ రెడ్డిని స్వయంగా బోనులో నిలబెట్టి, త్వరితగతిన కాలపరిమితితో కూడిన విచారణ జరిపినప్పుడే న్యాయం జరుగుతుంది. లేకపోతే హడావుడిగానే మిగిలిపోతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360