Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొరియా ఆవిష్కరణలు - మేడిన్ ఏపీ!

కొరియా ఆవిష్కరణలు - మేడిన్ ఏపీ!

Telugu 360 3 weeks ago

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చే వ్యూహాత్మక ప్రణాళికతో మంత్రి నారా లోకేష్ చేపట్టిన దక్షిణ కొరియా పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్లోబల్ కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ సర్కార్.. ఈ పర్యటన ద్వారా ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో వేల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడమే ధ్యేయంగా అడుగులు వేస్తోంది.

ఈ ఏడాదే ఎల్జీ శ్రీసిటీ అతి పెద్ద ప్లాంట్ ప్రారంభోత్సవం

సియోల్ పర్యటన మొదటి రోజున మంత్రి నారా లోకేష్ అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ గ్రూప్ అగ్రనాయకత్వంతో పాటు పలు కీలక పరిశ్రమల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమీక్షలు జరిపారు. ఏపీలో అనుకూలమైన పారిశ్రామిక విధానాలు, సులభతర వాణిజ్యం , అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను లోకేష్ గ్లోబల్ సీఈఓలకు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఇప్పటికే శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రూ. 5,001 కోట్ల భారీ పెట్టుబడితో భారతదేశంలోనే తమ అత్యంత పెద్దదైన మూడవ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను శరవేగంగా నిర్మిస్తోంది. మంత్రి నారా లోకేష్ చొరవతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు నిదర్శనంగా.. సుమారు 247 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ ప్లాంట్ పనులు కేవలం 14 నెలల రికార్డు కాలంలోనే 75 శాతం పైగా పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి ఇక్కడ కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభం కానుంది. ఈ అత్యాధునిక ప్లాంట్ ద్వారా రెఫ్రిజరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, టీవీలు , కంప్రెషర్ల తయారీ జరగనుండటమే కాకుండా.. స్థానిక యువతకు 1,500 పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు, 5,000 కు పైగా పరోక్ష ఉపాధి అవకాశాలులభించనున్నాయి. అంతేకాకుండా, దక్షిణ భారతదేశంలో ఎల్జీ సప్లై చైన్‌ను బలోపేతం చేస్తూ, శ్రీసిటీ చుట్టుపక్కల వందలాది అనుబంధ పారిశ్రామిక వెండర్ల ఎకోసిస్టమ్ అభివృద్ధికి ఈ మెగా ప్లాంట్ ఒక బలమైన మైలురాయిగా నిలవబోతోంది.

ఇతర కొరియా దిగ్గజాలకు ఆహ్వానం

ఎల్జీ మాత్రమే కాకుండా.. సెమీకండక్టర్లు, డిస్ప్లే ఫ్యాబ్రికేషన్, గ్రీన్ మొబిలిటీ రంగాలకు చెందిన పలు దక్షిణ కొరియా అనుబంధ పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో కియా మోటార్స్‌ను అనంతపురానికి తెచ్చి ఏపీ పారిశ్రామిక రూపురేఖలను మార్చిన తరహాలోనే.. ఇప్పుడు లోకేష్ సియోల్ పర్యటన ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మెగా డీల్స్ కుదురితే ఏపీకి మరోసారి అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్ దక్కడం ఖాయం.

హ్యూమన్ రిసోర్స్ ఒప్పందాలపై లోకేష్ దృష్టి

లోకేష్ సియోల్ పర్యటన కేవలం పెట్టుబడులకే పరిమితం కాకుండా, రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించేలా హ్యూమన్ రీసోర్స్ ఒప్పందాలపై కూడా దృష్టి సారించింది. మొదటి రోజు పర్యటన ముగిసే సమయానికి లభించిన సానుకూల సంకేతాలు చూస్తుంటే.. రాబోయే రోజుల్లో ఏపీ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి దక్షిణ కొరియా కంపెనీలు వెన్నుముకగా మారబోతున్నాయని స్పష్టమవుతోంది. ఈ పర్యటన విజయవంతం కావడం ద్వారా రాష్ట్రంలోకి వేల కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడంతో పాటు లక్షలాది మంది నిరుద్యోగ యువతకు హై-టెక్ ఉద్యోగాలు లభించనున్నాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360