సినిమా పరిశ్రమ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. బడ్జెట్లు అమాంతం పెరిగిపోయాయి. ఓటీటీ ప్రభావంతో థియేటర్లలో ఫుట్‌ఫాల్స్ తగ్గుతున్నాయి.
హిట్ శాతం కూడా తగ్గుతోంది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమాలు తగ్గిపోతున్నాయి. పెద్ద హీరోలు ఒక్కో ప్రాజెక్ట్‌కు ఏళ్ల తరబడి సమయం తీసుకుంటుండటంతో థియేటర్లకు సరిపడా కంటెంట్ కూడా అందడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే పరిశ్రమను చుట్టుముట్టిన సమస్యలు ఎన్నో ఉన్నాయి.
ఇలాంటి సమయంలో కమల్ హాసన్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ప్రైవేట్ చార్టర్స్, లగ్జరీ ట్రావెల్స్‌ను పక్కన పెట్టి సాధారణ ఎకానమీ ఫ్లైట్‌లో ప్రయాణిస్తూ హైదరాబాద్‌లోని 'కల్కి' షూటింగ్ సెట్స్‌కు చేరుకున్నారు కమల్ హాసన్.
కమల్ లాంటి లెజెండరీ స్టార్‌లు సాధారణంగా ప్రైవేట్ చార్టర్స్‌లోనే ప్రయాణిస్తారు. ఆ ప్రయాణ ఖర్చులు నిర్మాతలకు భారం అవుతాయి. అలాంటి సమయంలో కమల్ ఆ లగ్జరీకి స్వస్తి పలికి ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించడం ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది.
చాలా మంది స్టార్ హీరోలు ప్రైవేట్ చార్టర్స్, లగ్జరీ ట్రావెల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ కమల్ మాత్రం తన నుంచే మార్పు మొదలుపెట్టారు. ఆయన చూపించిన ఈ దారిలో మిగతా స్టార్ హీరోలు కూడా నడిస్తే నిర్మాతలకు ఖచ్చితంగా కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. మరి కమల్ బాటలో ఇంకెంతమంది హీరోలు అడుగులు వేస్తారో చూడాలి.

