బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
తాను బీజేపీని వీడి కొత్త పార్టీ పెట్టబోతున్నానంటూ వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ పుకార్లన్నీ పూర్తిగా అవాస్తవమని, కొందరు కావాలనే మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు.
తన నిబద్ధతను చాటుకుంటూ బండి సంజయ్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. నేనేంటో, నా సిద్ధాంతాలేంటో ఇక్కడి ప్రజలందరికీ తెలుసు. నిజమైన కమిట్మెంట్‌తో పని చేసే ప్రతి బీజేపీ కార్యకర్తకూ ఒకటే కోరిక ఉంటుంది.. తన చివరి శ్వాస విడిచాక పార్థివ దేహంపై బీజేపీ జెండా కప్పాలని కోరుకుంటారు, నా ఆశయం కూడా అదే అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో తనపై వస్తున్న పుకార్లకు ఆయన చెక్ పెట్టారు.
తాను పార్టీ మారుతున్నానంటూ కొందరు ప్రచారం చేయడమే కాకుండా, తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయడంపై సంజయ్ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ దయాదాక్షిణ్యాల మీద దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన నడుస్తోందా? అని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబం రాజకీయ ఉనికి కోసమే తనపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయిస్తోందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధికారం పోవడానికి తానే కారణం అని అందుకే తనను టార్గెట్ చేసి కుట్ర ప్రకారం అన్నీ చేయిస్తున్నాన్నారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికులు ప్రణాళికాబద్ధంగా చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు. ఓటమికి తానే కారణమన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ఇటువంటి చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. తాను ఎల్లప్పుడూ బీజేపీ సిద్ధాంతాలకే కట్టుబడి ఉంటానని, తెలంగాణలో పార్టీ బలోపేతానికి తన పోరాటం కొనసాగుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

