ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా మారుతోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రాష్ట్ర సొంత ఆదాయం గణనీయంగా వృద్ధి చెందడం ప్రభుత్వ యంత్రాంగంలో ఉత్సాహాన్ని నింపుతోంది.
వృద్ధి పథంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అవుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,04,345 కోట్లు గా ఉన్న రాష్ట్ర సొంత ఆదాయం, 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 1,10,643 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్ర ఆదాయంలో 6 శాతం వృద్ధి నమోదు అయింది. పన్నుల వసూళ్లలో పారదర్శకత, పాలనాపరమైన సంస్కరణల వల్ల ఆదాయ వనరులు మెరుగుపడుతున్నాయి.
కీలక శాఖల తోడ్పాటు.. లక్ష్యం దిశగా అడుగులు
రాష్ట్ర ఖజానాకు ప్రధానంగా జీఎస్టీ ద్వారా అత్యధికంగా రూ. 33,679 కోట్లు సమకూరాయి. అలాగే స్టాంపులు - రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ. 11,047 కోట్లు, గనుల శాఖ ద్వారా రూ. 10,300 కోట్ల ఆదాయం లభించింది. ఈ గణాంకాలను బేరీజు వేసుకున్న ప్రభుత్వం, రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ * రూ.1,27,506 కోట్ల భారీ ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ లక్ష్య సాధన కోసం ఎక్సైజ్, కమర్షియల్ టాక్సెస్, ట్రాన్స్‌పోర్ట్ వంటి కీలక శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
కట్టుదిట్టమైన ప్రణాళిక.. సీఎం దిశానిర్దేశం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదాయ వనరుల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించారు. గనులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కార్యకలాపాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఆదాయం గండి పడకుండా, సాంకేతికతను జోడించి పారదర్శకమైన విధానాలను అమలు చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయి ప్రజల ప్రయోజనం కోసమే వినియోగించాలన్నది ప్రభుత్వ సంకల్పం.
అభివృద్ధికి ఆదాయమే ఇంధనం
పెరుగుతున్న ఆదాయాన్ని రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమ పథకాలకు సమర్థవంతంగా వినియోగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కల్పన, విద్యా, వైద్య రంగాల బలోపేతానికి ఈ నిధులు కీలకమని ఆయన పేర్కొన్నారు. ఆదాయం పెరగడం వల్ల రాష్ట్రంపై అప్పుల భారం తగ్గే అవకాశం ఉంటుందని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు శుభసూచకమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

