Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కూటమిపై సైబర్ విషం.. పవన్ లక్ష్యంగా ముసుగు కుట్రలు !

కూటమిపై సైబర్ విషం.. పవన్ లక్ష్యంగా ముసుగు కుట్రలు !

Telugu 360 1 hr ago

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని నేరుగా ఢీకొట్టే సత్తా లేక, ప్రత్యర్థి వైఎస్సార్సీపీ వర్గాలు పక్కా విష ప్రచారానికి తెరలేపాయి. కూటమి ఐక్యంగా ఉన్నంత కాలం తాము రాజకీయంగా నిలదొక్కుకోవడం కల్ల అని గ్రహించిన తాడేపల్లి వ్యూహకర్తలు..

ఎలాగైనా జనసేనను కూటమి నుంచి విడగొట్టాలనే కుట్రను పతాక స్థాయికి చేర్చారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ టికెట్ల సర్దుబాటు, స్థానిక అసంతృప్తులను ఆసరాగా చేసుకుని విద్వేషపు బీజాలు నాటడమే లక్ష్యంగా వైసీపీ సోషల్ మీడియా ముసుగు వీరులు చెలరేగిపోతున్నారు. రాజకీయ యుద్ధాన్ని సైద్ధాంతికంగా కాకుండా, ముసుగు వేసుకుని సామాజిక మాధ్యమాల వేదికగా నీచాతినీచమైన మైండ్ గేమ్‌గా మార్చేశారు.

ఏకంగా ఫేక్ వాట్సాప్ చానల్ కూడా !

ఈ విష ప్రచారంలో ప్రధానంగా జనసేనలోని సినీ అభిమానులను, గతంలో టీడీపీతో రాజకీయ విభేదాలున్న కార్యకర్తలను టార్గెట్ చేసుకుని ఎత్తుగడలు వేశారు. పవన్ కల్యాణ్ నిర్ణయాలను తప్పుబడుతూ, ఆయన పార్టీని నాశనం చేస్తున్నారని, టీడీపీకి తాకట్టు పెట్టారని ఫేక్ అకౌంట్లతో ఒక ప్రణాళికాబద్ధమైన దాడికి తెగబడ్డారు. పవన్ ఆత్మాభిమానాన్ని, నాయకత్వ పటిమను కించపరిచేలా పోస్టులు పెడుతూ జనసేన సైనికుల్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. చివరికి ఆ తెగింపు ఎంతవరకు వెళ్లిందంటే.. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేరిటనే ఒక నకిలీ వాట్సాప్ ఛానల్ సృష్టించి, కూటమి పొత్తు నుంచి జనసేన బయటకు వచ్చేసిందంటూ ఒక కల్పిత ప్రకటనను వైరల్ చేసే దాకా వెళ్లింది. ప్రభుత్వం, డిప్యూటీ సీఎంవో నేరుగా రంగంలోకి దిగి క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి వచ్చిందంటే ఈ కుట్ర ఏ స్థాయికి చేరిందో స్పష్టమవుతోంది.

జనసేనలో వైసీపీ కోవర్టులు ఉండటం వల్లనే?

ఈ వ్యవహారం ఇంతటి ప్రమాదకర స్థాయికి చేరడం వెనుక కేవలం బయటి శత్రువుల ప్రచారమే కాకుండా.. జనసేన పార్టీలోనే తిష్టవేసిన అంతర్గత కోవర్టుల పాత్ర కూడా ఉందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. పార్టీ కండువా కప్పుకుని, లోపల ఉంటూనే వైసీపీ ఎజెండాను మోసే ఈ విషపు పురుగులే ఆ ముసుగు ప్రచారానికి ఊతం ఇస్తున్నాయి. స్థానిక సంస్థల్లో తమకు ఆశించిన పదవులు దక్కలేదనో, లేక తెరవెనుక ముడుపులు అందాయనో కొందరు నేతలు సోషల్ మీడియాలో అసంతృప్తి జ్వాలలను పెంచి పోషిస్తున్నారు. బయటి దాడులను తిప్పికొట్టడం కంటే.. పార్టీ నిలువునా తొలుస్తున్న ఇలాంటి కోవర్టులను గుర్తించి, వారిపై అత్యంత కటువుగా చర్యలు తీసుకోకపోతే పార్టీ పునాదులకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

జనసేనను బయటకు తేవడమే ప్రస్తుతం వైసీపీ టార్గెట్

వైసీపీ ఆలోచన అంతా ఒక్కటే.. ఎలాగైనా కూటమిలో అగాధాన్ని సృష్టించి, పవన్ కల్యాణ్‌ను బయటకు తీసుకురావడమే. ఎందుకంటే, 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవానికి ప్రధాన కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా పవన్ కల్యాణ్ నడిపించిన రాజకీయ చతురతే. పవన్ గనుక కూటమిని వీడితే ఓట్లు చీలిపోయి, తాము మళ్లీ తేలికగా అధికారంలోకి రావచ్చన్నది వైసీపీ భ్రమ. అందుకే పవన్ వ్యక్తిత్వాన్ని హననం చేసైనా, కేడర్ మధ్య చిచ్చు పెట్టైనా సరే ఈ బంధాన్ని తెంచేందుకు ఆ పార్టీ వర్గాలు తెగించి కుట్రలు పన్నుతున్నాయి. స్థానిక ఎన్నికలను అడ్డం పెట్టుకుని కూటమి సమన్వయాన్ని దెబ్బకొట్టేందుకు సాగిస్తున్న ఈ ప్రహసనం వారి నైరాశ్యాన్ని, పలాయనవాదాన్ని తేటతెల్లం చేస్తోంది.

పార్టీలోని అంతర్గత కోవర్టులను ఏరిపారేయడంతో పాటు, ఫేక్ ప్రచారాల వెనుక ఉన్న అసలు సూత్రధారులను చట్టపరంగా బోనులో నిలబెట్టేలా గట్టి చర్యలు చేపట్టాలి. అదే సమయంలో క్షేత్రస్థాయి కార్యకర్తలకు, సినీ అభిమానులకు వాస్తవ పరిస్థితులను వివరిస్తూ.. రాష్ట్ర స్థిరత్వానికి కూటమి కొనసాగింపు ఎంత కీలకమో స్పష్టమైన సందేశం ఇవ్వాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360