భారతదేశ వ్యాపార ప్రపంచంలో అత్యంత వివాదాస్పదమైన, అదే సమయంలో విస్మయపరిచే ప్రస్థానం లాటరీ కింగ్' శాంటియాగో మార్టిన్‌ది. ఒక సాధారణ టీ కొట్టు నుంచి మొదలైన ఆయన ప్రయాణం..
దేశంలోనే అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన స్థాయికి చేరింది. మయన్మార్ శరణార్థి కుటుంబం నుంచి వచ్చి, కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని స్థాపించిన మార్టిన్… వైసీపీకి కూడా ఏకంగా 150 కోట్ల రూపాయల విరాళిచ్చారు. ఆయన అల్లుడు ఇప్పుడు తమిళనాడు మంత్రి. ఆయన పేరు అధవ్ అర్జున్ రెడ్డి.
టీ కొట్టు నుంచి లాటరీ సామ్రాజ్యం వరకు..
శాంటియాగో మార్టిన్ పూర్వీకులు తమిళనాడుకు చెందినవారైనప్పటికీ మయన్మార్ వలస వెళ్లారు. అయితే అక్కడి పరిస్థితుల వల్ల శరణార్థులుగా తిరిగివచ్చి కోయంబత్తూరులో స్థిరపడ్డారు. చిన్నతనంలోనే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న మార్టిన్, ఒక టీ కొట్టు వద్ద లాటరీ టికెట్లు అమ్ముతూ తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. క్రమంగా లాటరీ వ్యాపారంలోని మెళకువలను ఒంటబట్టించుకుని, 1980వ దశకం చివరలో కోయంబత్తూరులో సొంతంగా లాటరీ ఏజెన్సీని స్థాపించారు. చురుకైన వ్యూహాలతో కర్ణాటక, కేరళ మీదుగా ఈ వ్యాపారాన్ని ఈశాన్య రాష్ట్రాలకు సైతం విస్తరించారు.
తమిళనాడులో నిషేధం.. ఈశాన్య రాష్ట్రాల్లో ఉదయం
వేలాది మంది ఉద్యోగులు, లక్షలాది మంది ఏజెంట్లతో మార్టిన్ దేశంలోనే తిరుగులేని లాటరీ కింగ్ గా ఎదిగారు. అయితే, 2003లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాష్ట్రంలో లాటరీ అమ్మకాలను పూర్తిగా నిషేధించడంతో మార్టిన్ వ్యాపారానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కానీ, ఆయన వెనకడుగు వేయకుండా తన ప్రధాన కేంద్రాన్ని ఈశాన్య రాష్ట్రాలకు మార్చారు. ముఖ్యంగా సిక్కిం ప్రభుత్వంతో కుదుర్చుకున్న లాటరీ ఒప్పందం మార్టిన్ జాతకాన్ని మార్చేసింది. సిక్కిం ప్రభుత్వ అధికారిక లాటరీలను పశ్చిమ బెంగాల్, పంజాబ్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల్లో విక్రయిస్తూ వందల కోట్ల టర్నోవర్ సాధించారు.
రాజకీయ పరిచయాలు - సినిమా వివాదం
వ్యాపార విస్తరణతో పాటు అన్ని పార్టీల రాజకీయ నేతలతో మార్టిన్ సత్సంబంధాలు పెంచుకున్నారు. 2011లో అప్పటి ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి కథ, డైలాగులు అందించిన ఇళైజ్ఞన్ అనే భారీ బడ్జెట్ సినిమాను మార్టిన్ నిర్మించడం అప్పట్లో పెద్ద సంచలనమైంది. అయితే, అదే ఏడాది తమిళనాడులో ప్రభుత్వం మారి జయలలిత అధికారంలోకి రాగానే మార్టిన్‌పై ల్యాండ్ గ్రాబింగ్ , అక్రమ లాటరీల విక్రయం వంటి అనేక కేసులు నమోదయ్యాయి. ఆయనపై గుండా యాక్ట్ కూడా ప్రయోగించి జైలుకు పంపారు. ఆ తర్వాత కోర్టుల ద్వారా ఆయన బయటకు వచ్చారు.
ఈడీ, సీబీఐ నిఘా నీడలో..
గత కొన్నేళ్లుగా మార్టిన్, ఆయన భార్య లీమా రోస్ కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఐటీ, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిఘా నీడలోనే ఉంటున్నారు. సిక్కిం ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నష్టం చేకూర్చారనే ఆరోపణలపై ఈడీ ఆయనకు చెందిన వేల కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో.. రాజకీయ పార్టీలకు అత్యధికంగా అంటే సుమారు రూ.1,368 కోట్లు విరాళంగా ఇచ్చింది మార్టిన్‌కు చెందిన ఫ్యూచర్ గేమింగ్ సంస్థేనని తేలింది.
అందరూ రాజకీయాల్లో
మార్టిన్ తప్ప ఆయన భార్య, కుమారుడు, అల్లుడు అందరూ రాజకీయాల్లో కీలక స్థానాల్లోకి వెళ్లారు. భార్య ఎమ్మెల్యే, అల్లుడు తమిళనాడు మంత్రి, కుమారుడు పుదుచ్చేరి ఎమ్మెల్యే. ఎన్ని వివాదాలు, ఐటీ దాడులు, కోర్టు కేసులు చుట్టుముట్టినా.. తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ, శాంటియాగో మార్టిన్ ఇప్పటికీ భారతీయ వ్యాపార, రాజకీయ వర్గాల్లో ఒక మోస్ట్ పవర్‌ఫుల్ అండ్ మిస్టీరియస్ పేరుగా కొనసాగుతున్నారు. విజయ్ ప్రభుత్వంపై మొదట ఎలాంటి మరకలు పడినా అది లాటరీ కింగ్ వైపు నుంచే అనుకోవచ్చు.

