తెలంగాణ రాష్ట్రంలో అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ LRS కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది భూయజమానులకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపులపై 25 శాతం రాయితీని కల్పిస్తూ పురపాలక శాఖ జీవో 131ని విడుదల చేసింది.
మే 1 నుంచి ప్రారంభమైన ఈ రాయితీ అవకాశం జూలై 31 వరకు, అంటే మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు, సామాన్యులపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్ కోసం మొత్తం 26 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, అందులో జలాశయాలు, ప్రభుత్వ భూములు వంటి నిషేధిత జాబితాలో ఉన్న సుమారు 6 లక్షల దరఖాస్తులను అధికారులు పక్కన పెట్టారు. మిగిలిన 20 లక్షల మంది దరఖాస్తుదారులకు ఫీజు చెల్లించాల్సిందిగా గతంలోనే నోటీసులు పంపారు. అయితే, గత ఏడాది ఇచ్చిన రాయితీ సమయంలో కేవలం 6 లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లించి తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకున్నారు. ఇంకా 14 లక్షల మంది దరఖాస్తుదారులు ఫీజు భారంతో వెనకడుగు వేయడంతో, వారి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం రెండోసారి ఈ రాయితీని ప్రకటించింది.
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ శాఖలు ఈ రాయితీని తక్షణమే అమలు చేయాల్సి ఉంటుంది. గతంలో ఫీజు చెల్లించిన వారిలో ఇప్పటికే 70 శాతం మందికి ప్రొసీడింగ్స్ అందజేశామని, మిగిలిన వారికి కూడా ప్రక్రియ వేగవంతం చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ రాయితీ గడువు ముగిసిన తర్వాత అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో, ప్లాట్ల యజమానులు ఈ మూడు నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల అటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరడమే కాకుండా, ఇటు ప్లాట్ల యజమానులకు తమ ఆస్తిపై చట్టబద్ధమైన హక్కులు లభిస్తాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు తమ ప్లాట్లకు బ్యాంకు రుణాలు పొందడానికి, భవన నిర్మాణ అనుమతులు తీసుకోవడానికి ఈ క్రమబద్ధీకరణ ఎంతో కీలకం కానుంది. జూలై 31 లోపు ఫీజు చెల్లించిన వారికి మాత్రమే ఈ 25 శాతం మినహాయింపు వర్తిస్తుందని, ఆ తర్వాత పాత ధరలే అమలవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

