వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ. 3,500 కోట్ల లిక్కర్ కుంభకోణం కేసులో దిగ్భ్రాంతికర నిజాలు బయటపడ్డాయి. అప్పట్లో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టు ముందు సెక్షన్ 164 కింద న్యాయమూర్తికి ఇచ్చిన వాంగ్మూలంతో పాటు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణలో సమర్పించిన ఆధారాలు ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల గుట్టును రట్టు చేశాయి.
లిక్కర్ దందా మొత్తం నాటి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే పకడ్బందీ కుట్ర ప్రకారం సాగిందని ఆయన వెల్లడించిన నిజాలు పాత పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
మొత్తం సీఎంవో కనుసన్నల్లోనే !
2022 ఏప్రిల్‌లోనే మద్యం సరఫరా, బ్రాండ్ల కేటాయింపుల్లో జరుగుతున్న అక్రమాలను ఆయన గుర్తించారు. పాపులర్ బ్రాండ్లను తొక్కేసి, డిమాండ్ లేని నకిలీ, లోకల్ బ్రాండ్లకు అడ్డగోలుగా ఇండెంట్లు పెట్టడంపై నాటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డికి, ప్రత్యేక అధికారి సత్యప్రసాద్‌కు ఆయన మెమోలు జారీ చేశారు. అయితే, ఆ మెమోలను వెనక్కి తీసుకోవాలని, సదరు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి కోటరీలోని ముఖ్య కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డిలు ఆయనపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. రజత్ భార్గవ ఆధారాలతో సహా వీటిని దర్యాప్తు సంస్థలకు ఇచ్చారు.
రజత్ భార్గవ అధికారాలు కత్తిరింపు
ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించినందుకు రజత్ భార్గవ రెక్కలు విరిచేసేలా సీఎంవో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎక్సైజ్ స్పెషల్ సీఎస్ పరిధిలో ఉండే ఆర్డర్ ఫర్ సేల్ అధికారాలను ఆయన నుంచి రాత్రికి రాత్రే లాక్కొని, తమకు అనుకూలంగా పనిచేసే కిందిస్థాయి అధికారులకు కట్టబెట్టారు. ప్రసిద్ధ బ్రాండ్ల ఇండెంట్లను మ్యాన్యువల్ విధానంలో మార్చేసి, కమిషన్లు చెల్లించే మద్యం కంపెనీలకే ఆర్డర్లు వెళ్లేలా మాయాజాలం చేశారు. ఈ దందాను సీఎం సమీక్షల్లో రజత్ భార్గవ లేవనెత్తినా, ధనుంజయ్‌రెడ్డి ఆ అంశాలను మినిట్స్‌లో చేర్చకుండా తొక్కిపెట్టేవారని, జగన్ కోటరీ ఆదేశాల మేరకు బెంబేలెత్తించడంతో తాను ఒంటరిగా పోరాడలేక మౌనం వహించాల్సి వచ్చిందని ఆయన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
రికార్డులు మాయం చేసేందుకు ప్రయత్నాలు
మరో దిగ్భ్రాంతికర విషయం ఏమిటంటే… వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే ముందు 2019 నుంచి 2024 వరకు జరిగిన OFS ఆర్డర్ల డేటాను, ప్రభుత్వ రికార్డులను మాయం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. అప్పటి ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్‌ను పాత తేదీలతో సంతకాలు చేసి డేటాను ట్యాంపర్ చేయమని సీఎంవో నుంచి ఒత్తిడి తెచ్చారని, ఆయన అంగీకరించకపోవడంతో రజత్ భార్గవపై కూడా ఒత్తిడి పెంచారని తెలుస్తోంది. అయితే, తాము ఈ అక్రమాలకు సహకరించలేదని, దానికి సంబంధించిన రికార్డుల పరంపర ఇప్పటికీ సెక్రటేరియట్ ఫైళ్లలో భద్రంగా ఉందంటూ దానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా ఆయన ఈడీ దర్యాప్తు అధికారుల ముందుంచారు.
ప్రస్తుతం రజత్ భార్గవ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఈడీ, సిట్ విచారణను మరింత వేగవంతం చేశాయి. సీఎంవో స్థాయి నుంచి సాగిన రూ. 3,500 కోట్ల కిక్‌బ్యాక్స్, మనీలాండరింగ్ నెట్‌వర్క్ గుట్టు వీడటంతో నాటి ప్రభుత్వ పెద్దలకు అరెస్టు భయం పట్టుకుంది. ప్రజాధనాన్ని దోచుకుని, జనం ప్రాణాలతో చెలగాటమాడిన లిక్కర్ ముఠా అసలు ముసుగులు త్వరలోనే పూర్తిగా తొలగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

