ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన చారిత్రాత్మక విజయంతో అధికారంలోకి వచ్చిన జనసేన పార్టీ, రాబోయే స్థానిక పోరులోనూ అదే ఊపును కొనసాగించడమే లక్ష్యంగా కీలక కసరత్తు ప్రారంభించింది.
ఇందులో భాగంగానే శుక్రవారం సాయంత్రం కీలక ఆత్మీయ సమావేశం నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశం.
ఈ విస్తృత స్థాయి సమావేశానికి జనసేన ప్రజాప్రతినిధులు, కీలక నేతలు హాజరుకానున్నారు. పార్టీకి చెందిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు , శాసనసభ్యులు , ఎమ్మెల్సీలతో పాటు వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఎంపికైన నేతలకు పిలుపునిచ్చారు. వీటితో పాటు గత కష్టకాలంలో పార్టీ జెండాను మోసిన సీనియర్లకు సముచిత ప్రాధాన్యం ఇస్తూ.. 2019 సార్వత్రిక ఎన్నికలు, 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన మాజీ అభ్యర్థులకు ప్రత్యేక ఆహ్వానాలు పంపారు.
ఈ వేదికగా స్థానిక సంస్థల ఎన్నికల విధివిధానాలు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై రూపొందించిన 14 మంది సభ్యుల ప్రత్యేక కమిటీ సమగ్రంగా చర్చించనుంది. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్దేశించిన మార్గదర్శకాలను, ఆయన సందేశాన్ని పార్టీ పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ నేతలకు కూలంకషంగా వివరించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి తరఫున సీట్ల సర్దుబాటు, అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలు మరియు క్షేత్రస్థాయి సమన్వయంపై నాయకులకు స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు.
గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ నిలబడి పోరాడిన కేడర్‌కు స్థానిక సంస్థల్లో ప్రాధాన్యం కల్పించడంపై ఈ సమావేశంలో ప్రాథమిక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గల్లీ స్థాయి నుంచి క్షేత్రస్థాయి నాయకత్వాన్ని రీచార్జ్ చేస్తూ, గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్, మున్సిపల్ పీఠాల వరకు విజయం సాధించడమే లక్ష్యంగా జనసేన వ్యూహరచన చేస్తోంది. పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేయడంపై ఈ ఆత్మీయ సమావేశం ఒక దిక్సూచిలా మారబోతోంది.

