Dailyhunt
లోకేష్  సైలెంట్  ఆపరేషన్ - వైసీపీకి టెన్షన్ !

లోకేష్ సైలెంట్ ఆపరేషన్ - వైసీపీకి టెన్షన్ !

Telugu 360 1 week ago

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఈ లోపు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనాలు సృష్టించేలా నారా లోకేష్ మార్క్ వ్యూహాలు సిద్ధమయ్యాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

గతంలో క్షేత్రస్థాయి పోరాటాలతో తన సామర్థ్యం చాటిన లోకేష్, ఇప్పుడు అటు పరిపాలనలోనూ, ఇటు దిల్లీ స్థాయిలో చక్రం తిప్పడంలోనూ అత్యంత పరిణితి కనబరుస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర పెద్దలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంలోనే కాకుండా.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా పెంచడంలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఢిల్లీ లాబీయింగ్ వైసీపీ అధినేత జగన్ రెడ్డికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

వైసీపీకి అర్థం కాని లోకేష్ ఢిల్లీ పర్యటను

నారా లోకేష్ అనుసరిస్తున్న వ్యూహాలు అటు జగన్ రెడ్డికి, ఇటు వైసీపీ శ్రేణులకు అస్సలు అర్థం కావడం లేదు. లోకేష్ వేస్తున్న ప్రతి అడుగులోనూ ఒక రాజకీయ ట్రాప్ ఉంటోంది. ఆ ట్రాప్‌లో పడి వైసీపీ నేతలు ప్రతిరోజూ సెల్ఫ్ గోల్స్ చేసుకుంటున్నారు. లోకేష్ ఎప్పుడూ నేరుగా విమర్శలు చేయడం కంటే, డాక్యుమెంటరీ ఆధారాలతో, వ్యవస్థాగతమైన లూప్‌హోల్స్‌ను బయటపెడుతూ వైసీపీని ఇరకాటంలో పెడుతున్నారు. అటు ఐటీ, పరిశ్రమల శాఖలో పెట్టుబడుల వరద పారిస్తూనే, ఇటు రాజకీయంగా వైసీపీ కోటలను బద్దలు కొట్టేలా ఆయన సాగిస్తున్న సైలెంట్ ఆపరేషన్ ఆ పార్టీని కోలుకోలేని దెబ్బ తీయబోతోంది.

రెండు, మూడు నెలల్లో కీలక పరిణామాలు

వచ్చే రెండు మూడు నెలల్లో ఏపీ రాజకీయాల్లో జరగబోయే పరిణామాలు వైసీపీ ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ స్కామ్‌లు, ముఖ్యంగా మద్యం, ఇసుక, భూ కుంభకోణాలకు సంబంధించిన కీలక పత్రాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇవన్నీ ఒక క్రమపద్ధతిలో విచారణ సంస్థలకు చేరుతున్నాయి. ఈ పరిణామాలు కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, చట్టపరమైన చర్యల దిశగా వేగంగా కదులుతున్నాయి. త్వరలోనే వైసీపీలోని కొందరు కీలక నేతలు చట్టం ముందు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది. ఇది ఆ పార్టీ క్యాడర్‌లో ఇప్పటికే తీవ్ర అసహనాన్ని, ఆందోళనను నింపుతోంది.

ఇదే రకమైన రాజకీయంతో జగన్ తట్టుకోలేరు!

చంద్రబాబు మార్గదర్శకత్వంలో లోకేష్ చేస్తున్న ఈ పొలిటికల్ క్లీన్ అప్ ఆపరేషన్ రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకం అని నమ్ముతున్నారు. జగన్ హయాంలో దెబ్బతిన్న వ్యవస్థలను చక్కదిద్దడమే కాకుండా, రాజకీయంగా వైసీపీని నామరూపాలు లేకుండా చేయడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో ముంచుకొస్తున్న ఈ సునామీ వైసీపీని నిండా ముంచేయడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రతిపక్షం పూర్తిగా ప్రజా వ్యతిరేకం అని ప్రజల ముందు ఉంచాలని కూటమి వ్యూహం, ఈ రెండు నెలల్లో జరగబోయే కీలక పరిణామాలతో ఒక స్పష్టమైన రూపానికి రానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360